మున్సిపల్‌ పీఠంపై తొలి మహిళామణి

28 Jan, 2020 12:20 IST|Sakshi
ప్రమాణస్వీకారం చేస్తున్న ఆకుల రజిత, సిద్దిపేట జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ(ఇన్‌సెట్లో)

20 వార్డులకు 11 వార్డుల్లో మహిళలదే విజయం

హుస్నాబాద్‌ మున్సిపల్‌లో వెల్లివిరిసిన మహిళా సాధికారత

సాక్షి, హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠాన్ని మొట్ట మొదటిసారిగా బీసీ మహిళనే వరించింది. అందరి అంచనాలను తలకిందులయ్యాయి. మొదటి నుంచి చైర్‌ పర్సన్‌ మహిళకే దక్కుతుంది అనుకున్నప్పటికీ జనరల్‌ మహిళా స్థానంలో బీసీ మహిళకు కట్టబెట్టారు. వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవిని పురుషుడికి అప్పగిస్తారని భావిస్తే అన్యూహంగా వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవిని సైతం మహిళకు అప్పగించడం హుస్నాబాద్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో దాదాపు 30ఏళ్ల తర్వాత అతివలు పాలించే అవకాశం దక్కింది. 20 మంది వార్డు మెంబర్లకు ఇందులో 11 మంది మహిళలే కావడం, అందులో చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవులు మహిళలనే వరించడంతో మున్సిపల్‌లో మహిళా సాధికారత వెళ్లివిరియనుంది. మున్సిపల్‌ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది.

ఇక ముందుగా టీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది, కాంగ్రెస్‌కు చెందిన 6 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇండిపెంటెండెంట్‌కు చెందిన ముగ్గురు సభ్యులచే ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ ప్రారంభించారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణులు తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం లేదని, చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక సమావేశాన్ని బహిష్కరించారు. 

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఆకుల రజిత... 
మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికలో భాగంగా కోరం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ నుంచి చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ఆకుల రజిత, కాంగ్రెస్‌ నుంచి చిత్తారి పద్మకు భీపాంలు అందటంతో ఆల్ఫా బెటికల్‌ ప్రకారంగా కాంగ్రెస్‌ పార్టీకి బలం నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా చిత్తారి పద్మను కాంగ్రెస్‌ సభ్యుడు మ్యాదరబోయిన శ్రీనివాస్‌ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్‌ఎస్‌ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదిం​చగా, మరో సభ్యుడు పెరుక భాగ్యరెడ్డి బలపరిచాడు. అలాగే ఇండిపెంటెండెంట్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనగామ రత్నను కాంగ్రెస్‌ సభ్యురాలు పున్న లావణ్య ప్రతిపాదిం​చగా, భూక్య స్వరూప బలపర్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, ఇండిపెండెంట్‌ అభ్యర్థి చైర్‌ పర్సన్లుగా కాంగ్రెస్‌ సభ్యులే ప్రతిపాదించి బలపర్చగా, మొదటగా ప్రతిపాదించిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిత్తారి పద్మనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్డీఓ స్ఫష్టం చేశారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు.

ఈ నేపథ్యంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఆకుల రజితకు మద్దతుగా టీఆర్‌ఎస్‌కు చెందిన  9 మంది, ఇండిపెంటెండెంట్లు ఇద్దరు, ఎక్స్‌ అఫియోసభ్యుడు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లు మొత్తం 12 సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి చిత్తారి పద్మకు కాంగ్రెస్‌కు చెందిన 6గురు, ఇండిపెంటెండెంట్‌ అభ్యర్థి జనగామ రత్నలు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో రజితకు 12 మంది మద్దతు పలుకగా, పద్మకు 7గురు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీఓ అత్యధిక సభ్యులు రజితకు మద్దతు తెలుపడంతో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఆకుల రజిత ఎన్నికైనట్లు ప్రకటించారు. 

మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా అయిలేని అనిత  
మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో  ముందుగా పార్టీని ఆహ్వానించగా, వైస్‌ చైర్మన్‌ అయిలేని అనితను టీఆర్‌ఎస్‌ సభ్యురాలు కొంకట నళినీదేవి ప్రతిపాధించగా, బొజ్జహరీశ్‌ బలపర్చారు. అలాగే కాంగ్రెస్‌ నుంచి చైర్‌ పర్సన్‌గా కోమటి స్వర్ణలతను మ్యాదరబోయిన శ్రీనివాస్‌ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య  బలపరిచారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా, టీఆర్‌ఎస్‌కు చెందిన అయిలేని అనితకు 9 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, ఇద్దరు ఇండిపెంటెండెంట్‌ సభ్యులు, ఒకరు ఎక్స్‌ అఫిషియో సభ్యుడు మొత్తం 12 మంది సభ్యులు చేతులేత్తి మద్దతు పలికారు. కోమటి స్వర్ణలతకు కాంగ్రెస్‌ 6గురు సభ్యులు, ఇండిపెంటెండెంట్‌ ఒకరు చేతుతెత్తి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిలేని అనితకు 12 మంది, కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటి స్వర్ణలతకు 7గురు మద్దతు తెలిపారు. అత్యధికంగా సభ్యులు మద్దతు ఉన్న అనిత మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌గా అయిలేని అనితలచే ఆర్డీఓ  ప్రమాణ స్వీకారం చేయించారు. 


వాల సుప్రజా నవీన్‌రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌బాబు

అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ..
హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. ఇక మున్సిపాలిటీలోని 20వ వార్డు అభ్యర్థినిగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన వాల సుప్రజా నవీన్‌రావు భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 84.5 శాతం​ మెజార్టీ సాధించి సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థినిగా నిలిచారు. టీఆర్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్‌ఎస్‌ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదిం​చారు.

మరిన్ని వార్తలు