తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం

16 Dec, 2018 01:17 IST|Sakshi

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ 

కమిషనర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, తాండూర్, మేడ్చల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, అక్కడి పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఉన్నతాధికారులతో కమిషనర్‌ సమీక్షించారు. ఆయా అధికారులతో మాట్లాడారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన చివరి గింజను కూడా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాల ప్రభావం రైతాంగం మీద ఏమాత్రం పడకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు 
జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పౌరసరఫరాల కమిషనర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్‌ 7330774444, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 00333ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో, నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. తేమ శాతం విషయంలో రైతాంగానికి అధికారులు అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉంటుందన్నారు. మార్కెటింగ్‌ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడైనా టార్పాలిన్ల కొరత ఉంటే దాన్ని అధిగమించాలని, వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

మరిన్ని వార్తలు