ఈ–పాస్, ఐరిస్‌తో రూ. 917 కోట్లు ఆదా

26 May, 2019 01:08 IST|Sakshi

రేషన్‌ బియ్యం అక్రమాల అడ్డుకట్ట

బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

పౌరసరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఈ–పాస్, ఐరిస్‌ విధానంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని, ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి రూ. 917 కోట్ల విలువ చేసే 3.52 లక్షల టన్నుల బియ్యం ఆదా అయిందని పౌరసరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఈపాస్, ఐరిస్‌ విధానం ద్వారా ప్రతి నెలా 15 నుంచి 20% వరకు బియ్యం మిగులు ఉందని వెల్లడించారు. పౌరసరఫరాల భవన్‌లో రేషన్‌ డీలర్లతో కమిషనర్‌ శనివారం నిర్వహించిన సమావేశంలో సబర్వాల్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి నెలా అర్హులైన 2.83 కోట్లమందికి వేల కోట్ల రూపాయల సబ్సిడీతో కిలో రూపాయి చొప్పున 6 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు, రేషన్‌ డీలర్లు కలసి బియ్యాన్ని అక్రమార్కులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.

పేదల బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్‌ డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఓఎస్‌డీ రాందాస్‌కు ప్రత్యేక బాధ్యత లు అప్పగించామన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నెలా రేషన్‌ షాపుల్లో జరిగే లావాదేవీలపై ఈ బృందాలు నిఘా పెట్టి, రైస్‌ మిల్లులను తనిఖీ చేస్తాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు