భౌగోళికంగా సరిహద్దులే ఉన్నాయే గానీ..: తమిళి సై

10 Oct, 2019 15:15 IST|Sakshi

జలవిహార్‌లో ఘనంగా ‘అలయ్‌ బలయ్‌’

సాక్షి, హైదరాబాద్‌ : చెడు మీద మంచి సాధించిన విజయమే విజయదశమి అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. బతుకమ్మ, బోనాల పండుగ తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. దసరా సందర్భంగా అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని గురువారం జలవిహార్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భావితరాలకు పండుగ ప్రాధాన్యతను తెలియజేయడానికే అలాయ్‌ బలాయ్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ ప్రకృతి నిలయమని... ప్లాస్టిక్‌ భూతాన్ని అంతం చేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్బంగా గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ మాట్లాడుతూ..తెలంగాణకు గవర్నర్‌గా రావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు తనకు ఆదర్శం అన్నారు. పదిహేనేళ్లుగా దత్తాత్రేయ అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. మానవ సంబంధాలు పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నాయే గానీ... సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. ‘చిన్న పిల్లల టిఫిన్ బాక్సుల్లో బర్గర్లు, చిప్స్ ఉంటున్నాయి. చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేలా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి’ అని గవర్నర్‌ సూచించారు.

ఇక విద్యాసాగర్ రావు మాట్లాడుతూ... ‘తెలంగాణలో కవులు, కళాకారులు మళ్ళీ ముందుకు రావాలి. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలి. సాంస్కృతిక విప్లవం తీసుకువచ్చి.. భాషను రక్షించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. అందరిని కలుపుతున్న పండుగ అలాయ్ బలాయ్ అని కిషన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ సాధనలో అలాయ్ బలాయ్ దోహదపడింది. విభేదాలు, తారతమ్యాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు దేశ అభివృద్ధికి పాటుపడాలి’ అని పేర్కొన్నారు.

వీహెచ్‌ అసహనం
అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమకు తగిన సమయం ఇవ్వటం లేదంటూ వేదికపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ కూడా తమ పట్ల ఇలాగే వ్యవహరించారంటూ అసహనానికి లోనయ్యారు. ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు లేకపోవటం బాధాకరమని.. తెలంగాణ ఇచ్చిన సోనియాను అవమానించారన్నారు. పాత గవర్నర్‌లా చేయొద్దని.. గవర్నర్‌ తమిళి సైని కోరారు. హిమాచల్ గవర్నర్ తమను జరచూసుకోవాలంటూ దత్తాత్రేయను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు