కిక్కు.. లక్కెవరికో

22 Jun, 2014 23:51 IST|Sakshi
కిక్కు.. లక్కెవరికో

బసాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం దుకాణాదారుల ఎంపిక సోమవారం లాటరీ ద్వారా చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 390 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ అధికారుల దరఖాస్తులు కోరగా గడువు ముగిసే నాటికి 340 దుకాణాలకు 3,368 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 50 మద్యం దుకాణాలకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. కొత్త సర్కారు రూపొందించిన మద్యం పాలసీకి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
 
జూలై 1వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాల  ఏర్పాటుకు సంబంధిత అధికారులు డీలర్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు గతంలో నిర్ణయించిన రూ 1.054 కోట్ల ధరను కొత్త ప్రభుత్వం రూ.90 లక్షలకు తగ్గించినా.. వ్యాపారస్తుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దరఖాస్తులు రాని 50 దుకాణాల్లో 49 గరిష్ట కేటగిరీ(రూ.90లక్షలు) దుకాణాలు కాగా, ఒకటి కనిష్ట కేటగిరీ (రూ.32.5లక్షలు)లో ఉంది. సోమవారం ఉదయం వనస్థలిపురంలో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలకు డీలర్లను ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు