ఫోన్‌ కొట్టు.. మద్యం పట్టు!

22 Apr, 2020 11:08 IST|Sakshi

శంషాబాద్‌లో కొనసాగుతున్న అక్రమదందా  

గుట్కాలు సైతం విక్రయాలు

శంషాబాద్‌: ఓ వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా శంషాబాద్‌లో మద్యం విక్రయాలు ఆగడం లేదు.   ఫోన్‌ల ద్వారా మద్యాన్ని కోరుకున్న వారికి చేరవేస్తున్నారు. కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. మధ్యవర్తులు కూడా పట్టణంలోని కొన్ని దుకాణాల వద్ద అడ్డాగా చేసుకుని పనికానిచ్చేస్తున్నారు. ఈ తరహాలో అమ్మకాలు సాగిస్తున్న రాళ్లగూడ దొడ్డికి చెందిన మహేష్‌ అనే వ్యక్తిని నాలుగురోజుల కిందట ఎక్సైజ్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. మద్యంప్రియుల బలహీనతలను కొందరు వ్యాపారులు, నేతలు భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ సమయాల్లో రూ.800 ఉన్న ఫుల్‌బాటిల్‌ ధర రూ.4వేలకు పెంచి విక్రయిస్తున్నారు.(లాక్‌డౌన్‌ తర్వాత నమోదైన కేసు ఇదొక్కటే..)

నేతలు సైతం..
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు నేతలు భారీగానే మద్యం సేకరించారు. అయితే, ఆ నిల్వలు కొందరు నేతల వద్ద ఇంకా ఉన్నట్లు సమాచారం. సదరు నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు తెలిసిన వారికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. మద్యం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు ఇదే తరహాలో జరుగుతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లో పెద్ద ఎత్తు కల్తీ కల్లును ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్‌ పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  (అధికార మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది?)

జోరుగా గుట్కా దందా..
శంషాబాద్‌ పట్టణంలో గుట్కాల దందా కూడా సాగుతోంది. ఆయా పాన్‌ డబ్బాల విక్రేతలు ద్విచక్రవాహనాలపై ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఫోన్‌ల ద్వారా ఆర్డర్‌ తీసుకుని గుట్కాలు విక్రయిస్తున్నారు. మరికొందరు తమ డబ్బాలకు సమీపంలోనే అడ్డాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున గుట్కాలను విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం తొండుపల్లి వద్ద సుమారు 15వేల విలువైన గుట్కా, పాన్‌ మసాలాను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందించండి
శంషాబాద్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఎక్కడైనా మద్యం, కల్లు విక్రయాలు జరిగితే 9440902325 నంబరుకు సమాచారం అందించాలి. శంషాబాద్‌ పట్టణంలో ఫోన్‌ ద్వారా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నాలుగు రోజుల కిందట ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశాం. మద్యం దుకాణాలన్నింటికీ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో మరోసారి తాళాలు వేశాం. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మద్యం వచ్చే అవకాశాలుండడంతో ప్రజలు సమాచారం అందించి అధికారులకు సహకరించాలి.– శ్రీనివాస్, ఎక్సైజ్‌ సీఐ

మరిన్ని వార్తలు