మద్యం కిక్‌.. నిషేధంతో చెక్‌

27 Jun, 2020 10:25 IST|Sakshi
కాయిదంపల్లి గ్రామంలో మద్యపాన నిషేధం బోర్డు

గ్రామాల్లో మద్యం విక్రయాలపై నిషేధం

తొమ్మిది పంచాయతీల్లో నిషేధం అమలు

విక్రయిస్తే జరిమానాలు

తగ్గిన రోడ్డు ప్రమాదాలు, గొడవలు  

బెల్టు షాపుల ఏర్పాటుతో రేయింబవళ్లు మద్యం దొరుకుతోంది. మద్యం తాగినవారు ఇతరులతో ఘర్షణ పడటం     సర్వసాధారణంగా మారింది. ఇక తాగినవారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. విసుగు చెందిన గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. మద్యం విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు. పదేళ్లుగా మద్య నిషేధం కొనసాగుతుండటంతో వారు ఆశించిన ఫలితాలు సాధించారు. గ్రామాల్లో గొడవలు తగ్గాయి. గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి.       

మద్యం అమ్మిన వారికి జరిమానా
మందాపూర్‌ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.30 వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. తీర్మానం ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. ఆ డబ్బును పంచాయతీ ఖాతాలో జమచేశారు. ఇక చేవెళ్ల గ్రామంలో కూడా మద్యం వికయ్రించిన వ్యక్తికి రూ.10 వేలు జరిమాన విధించారు. దీంతో మద్యం విక్రయాలు తగ్గాయి. రాంపూర్, వెంకటరావుపేట, ముప్పారం, అప్పాజిపల్లి, రెడ్డిపల్లి, సీతానగర్‌లో మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతోంది.  

మందాపూర్‌లో మద్య నిషేధంపై తీర్మానం చేసిన గ్రామస్తులు (ఫైల్‌)
అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది పంచాయతీలలో మద్యం అమ్మకాల నిషేధం అమలు చేస్తున్నారు. పదేళ్లుగా గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. మండల పరిధిలోని కాయిదంపల్లి, రాంపూర్, సీతానగర్, రెడ్డిపల్లి, వెంకట్‌రావుపేట, చేవెళ్ల, ము ప్పారం, అప్పాజిపల్లి, మందాపూర్‌ గ్రామాలలో మద్యం విక్రయాలను నిషేధించారు.  మండలంలో మద్య నిషేధం అమలు చేసిన మొదటి గ్రామం కాయిదంపల్లి. ఈ గ్రామంలో మద్యం అమ్మకాలతో గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. దీంతో వీరి కుటుంబాలు వీధులపాలవుతున్నాయి. అంతేకాకుండా మద్య ం మత్తులో ఇతరులతో ఘర్షణ పడేవారు. గమనించిన గ్రామ పెద్దలు, నాటి సర్పంచ్‌ సంగమేశ్వర్‌ 2008లో బెల్ట్‌ షాపుల  రద్దతోపాటు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ.5 వేల జరిమానా విధించాలని నిబంధనలు రూపొందించి తీర్మానంపై సంతకాలు చేశారు. గత 12 ఏళ్లుగా గ్రామంలో మద్య నిషేధం అమలు చేస్తున్నారు. నిషేధానికి గ్రామస్తులు కట్టుబడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం.

ప్రజల సహకారంతో అభివృద్ధి
గ్రామాన్ని అభివృద్ధి చేయలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్లాస్టిక్‌ నిషేధం, మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. ప్రజలు సహకారం అందిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిపై ఆధారపడిన కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడుతున్నాయి.  – భేతయ్య, సర్పంచ్, కాయిదంపల్లి

బెల్టు షాపుల నిషేధంతో ప్రశాంతం
గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు నిషేధించడంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నేలకొంది. గ్రామంలో గొడవలు తగ్గాయి. పన్నెండేళ్లుగా మద్యం విక్రయాలపై నిషేధం కోనసాగుతుంది. ప్రజల కోరిక మేరకు చర్యలు తీసుకున్నాం. మద్య నిషేధంతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి.  – సంగమేశ్వర్‌ , మాజీ సర్పంచ్‌

జరిమానా విధించాంగ్రామస్తులు,
యువకుల సహకారంతో 2019లో గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాం. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేయించాం. మద్యం విక్రయించినందుకు రూ.30 వేలు జరిమానా వేశాం. అప్పటి నుంచి గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయించడం లేదు. ప్రతీ గ్రామంలో ఇలాగే మద్యం విక్రయాలను నిషేదిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి.– రాజు, సర్పంచ్, మందాపూర్‌ 

మరిన్ని వార్తలు