కదంతొక్కిన మహిళా లోకం..

6 Jul, 2014 02:39 IST|Sakshi
కదంతొక్కిన మహిళా లోకం..

డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి
- మద్య నిషేధం విధించి, మహిళలకు రక్షణ కల్పించాలి
- రుణ మాఫీపై ఖానాపూర్‌లో కదంతొక్కిన మహిళలు

 ఖానాపూర్ :  వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పుడు అధిక వడ్డీ వేసి రుణాలు బలవంతంగా వసూలు చేస్తున్నారని, డ్వాక్రా రుణాలు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మహిళలు కదంతొక్కారు.
 
భారీ ఎత్తున  ఆందోళన
శనివారం మండల కేంద్రంలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ తీశారు. తదుపరి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళా గ్రూప్‌కు రూ.10 లక్షల రుణాలు ఇవ్వాల్సింది పోయి.. 2012 నుంచి వడ్డీ మాఫీ అని చెప్పి ఇప్పుడు వాటిపై వడ్డీ వేసి నోటీసులు ఇస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని వారు దుయ్యబట్టారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేసి.. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అనేక గ్రూపులకు స్థానిక ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ అధికారులు నోటీసులు పంపారని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళ రుణాన్ని కూడా మాఫీ చేయాలని కోరారు. రుణాల వసూళ్ల పేరిట ఒత్తిడి చేస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో మద్య నిషేధం విధించి.. రక్షణ కల్పించాలన్నారు.

అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రాజేశ్వరికి అందించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మి, ఎం.జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఎ.మంగ, కోశాధికారి నంది సమత, సహాయ కార్యదర్శి ఎం.హరిత, నాయకులు జక్కుల గంగామణి, నర్ర ఎంకుబాయి, రాజవ్వ, పద్మ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న, నారాయణ, ఎల్‌ఆర్ ఉపాలి, విజయ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు