ఎట్లుంటుందో!

17 Sep, 2019 08:45 IST|Sakshi

నూతన మద్యం పాలసీపై ఉత్కంఠ  

లైసెన్స్‌ ఫీజు పెరిగే అవకాశం

నేడో రేపో నోటిఫికేషన్‌  

30తో ముగియనున్న ప్రస్తుత పాలసీ   

సాక్షి, సిటీబ్యూరో: కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 30తో ప్రస్తుత మద్యం పాలసీ ముగియనుండడంతో.. నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఆదాయ వనరైన మద్యం అమ్మకాలను పెంచుకోవడం ద్వారా మరింత రాబడి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పాలసీ ముగియడానికిఇంకో 13 రోజులే ఉండగా, ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్‌  విడుదల చేయకపోవడంతో కొత్త పాలసీ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ అటు వ్యాపారుల్లో, ఇటు ప్రజల్లోనూ నెలకొంది. 

ఫీజు పెరుగుతుందా?  
హైదరాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 212 వైన్స్, 225 బార్లు ఉండగా... రంగారెడ్డి జిల్లాలో 412 వైన్స్, 405 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2017–19లో శివార్లలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఫీజును ఏడాదికి రూ.45 లక్షలుగా నిర్ణయించగా.. రెండేళ్లకు కలిపి రూ.90 లక్షలు చెల్లించారు. తాజాగా శివార్లలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు ఏర్పడిన విషయం విదితమే. దీంతో కొత్త కార్పొరేషన్ల పరిధిలో దుకాణాల సంఖ్య పెరగడంతో పాటు లైసెన్స్‌ ఫీజు కూడా భారీగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2017–19లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని దుకాణాలకు ఏడాదికి లైసెన్స్‌ ఫీజు రూ.1.08 కోట్లుగా నిర్ణయించి రెండేళ్లకు రూ.2.16 కోట్లు వసూలు చేశారు. ఈ రెండేళ్లలో మద్యం దుకాణాల ద్వారా వ్యాపారం భారీగా జరగడంతో ఫీజు పెంచే అవకాశాలున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు