కిక్కు తగ్గింది.. 

10 Jun, 2019 11:11 IST|Sakshi

కాజీపేట అర్బన్‌: అలిసిన మనసుకు సాంత్వన కలుగుతుందని కొందరు.. అలవాటుతో మరికొంద రు.. బానిసలై ఇంకొందరు సాయంత్రం అయిందంటే మద్యం తాగాల్సిందే! అయితే, డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన కొన్ని బ్రాండ్ల మందు ఎంత తాగినా కిక్కు ఎక్కడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎలాగూ మద్యపాన ప్రియులు మందులో నీళ్లు కలుపుతారు కదా.. అదే పని మేమే చేస్తే పోలా.. అన్న భావనతో కొందరు వైన్స్, బార్ల యజమానులు ఇష్టారాజ్యంగా మందు కల్తీ చేసేస్తున్నారు. తద్వారా రూ.లక్షలు గడిస్తున్న ఈ మాఫియా, మందు బాబుల జేబులను గుళ్ల చేస్తోంది.

నిలదీస్తేనే...
పని ఒత్తిడిలో అలసిపోయి, శుభకార్యాల్లో ఆనందంగా గడిపేందుకు మద్యం ప్రియులు మద్యం షాపులకు వెళ్తుంటారు. సాధారణంగా క్వార్టర్‌ సీసా తాగితే కిక్కుతో ఊగిపోయే వారికి సైతం ఫుల్‌ బాటిల్‌ తాగినా కిక్కు ఎక్కడం లేదట! దీంతో మద్యం షాపు నిర్వాహకులను నిలదీయడంతో మద్యంలో కల్తీ జరిగిన విషయం బట్టబయలవుతోంది. ఫలితంగా మందు బాబులకు కిక్కు ఎక్కకున్నా.. మద్యం షాపుల్లోని గల్లాలు మాత్రం కళకళలాడుతున్నాయి.

వేసిన సీల్‌ వేసినట్లే..
మద్యం బాటిళ్ల మూతకు వేసిన సీల్‌ వేసినట్టుగానే ఉంటుండగా.. మద్యం మాత్రం కల్తీ అవుతోంది. మద్యం బాటిళ్ల మూతలను ప్రత్యేక పరికారాలతో తీసేయడం.. నీళ్లు కలిపాక మళ్లీ మూత పెట్టడం నిష్ణాతులకే సాధ్యమవుతుంది. దీనికోసం కొందరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన మద్యం మాఫియా ఎక్కువగా అమ్ముడయ్యే ఒరిజినల్‌ చాయిస్, రాయల్‌ స్టాగ్, బ్లెండర్‌ స్ప్రైడ్‌ వంటి బ్రాండ్ల మందు బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ
నెలవారిగా బార్లు, వైన్స్‌ నుంచి అందే మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు తేలిపోతూ.. మద్యం షాపుల తనిఖీల మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టడం, సమయపాలన పాటించేలా చూడాల్సి ఉన్నప్పటికీ ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఇక బెల్ట్‌ షాపుల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట విషయానికొస్తే కొన్ని నెలలుగా సమయపాలన, కల్తీ విషయంలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

నగరాల్లో బ్రాండ్‌ మిక్సింగ్‌
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మద్యాన్ని నీటితో కల్తీ చేస్తుండగా కాజీపేట, హన్మకొండ, వరంగల్‌తో పాటు నగరాల్లో ఎక్కువ రేటు బ్రాండ్‌ మద్యంలో తక్కువ రేటు బ్రాండ్‌ మద్యాన్ని కలిపేస్తున్నారు. ఇటీవల హన్మకొండలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కిక్కు ఎక్కడం లేదంటూ మందు బాబులు ఏకంగా గొడవకు దిగిన విషయం విదితమే.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో వెలుగు చూసిన ఘటనల్లో కొన్ని..

  •      జనగామలోని వైన్‌షాపులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేయగా నీళ్లు కలిపిన 27 బాటిళ్లు లభ్యమయ్యాయి.
  •      ములుగు జంగాలపల్లిలో వైన్‌షాపులో ఏకంగా 500 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించడం గమనార్హం.
  •      ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకుని 20 బాటిల్లు, మూతలు, క్యాన్లలోని లూజ్‌ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  •      వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వైన్స్‌లో 19 కల్తీ చేసిన మద్యం బాటిళ్లు లభించాయి.
మరిన్ని వార్తలు