చుక్కకు కిక్కు!

7 Oct, 2019 11:07 IST|Sakshi

మద్యం మరింత ప్రియం  

పండగ నేపథ్యంలో వ్యాపారుల దోపిడీ  

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం  

తుర్కయాంజాల్‌కు చెందిన శంకర్‌: శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ వైన్‌షాపునకు వెళ్లి క్వార్టర్‌ మద్యం కావాలని అడగ్గా... ఎమ్మార్పీపై అదనంగా రూ.10 ఇవ్వాలని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే.. మద్యం ధరలు పెరిగాయని సమాధానమిచ్చారు. దీంతో చేసేదేమీ లేక రూ.10 అదనంగా చెల్లించి క్వార్టర్‌ కొనుగోలు చేశాడు.  

ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన రాములు ఆర్‌కేపురంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లి ఆఫ్‌ బాటిల్‌ కొనుగోలు చేయగా రూ.20అదనంగా తీసుకున్నారు. ఎందుకనిఅడిగితే... ‘ఇష్టం ఉంటేతీసుకో.. లేకపోతే లేదు’ అని చెప్పారు. మరోవైపు చీప్‌ లిక్కర్‌ కూడా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇది ఏదో ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు.. గ్రేటర్‌లోని అన్ని దుకాణాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది.  

సాక్షి, సిటీబ్యూరో: మద్యం దుకాణాల లైసెన్స్‌ అయిపోయినప్పటికీ ప్రభుత్వం ఒకనెల గడువు పెంచడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఇష్టం ఉంటే తీసుకోండ’ని దురుసుగా సమాధానం ఇస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా... గడువు ముగిసింది కాబట్టి తమను ఏం చేయలేరనే ధీమాతో ఇలా చేస్తున్నారు. మరోవైపు దసరా పండగ రూపంలో అదృష్టం కలిసిరావడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అధిక ధరలకే బహిరంగంగా విక్రయిస్తున్నా ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోవ డం లేదన విమర్శలు వినిపిస్తున్నాయి. 

మళ్లీ దక్కదేమోనని...   
2017–19 మద్యం పాలసీ ప్రకారం సెప్టెంబర్‌ 30తో లైసెన్స్‌ గడువు ముగిసింది. అయితే కొత్త పాలసీ సిద్ధం కాకపోవడంతో ప్రభుత్వం పాత దుకాణాలకే నెల రోజుల గడువు పెంచిన విషయం విదితమే. కొత్త పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. అక్టోబర్‌ చివరి వరకు ప్రస్తుత వ్యాపారులకు గడువు ఉంది. ఈ నెల ముగిశాక కొత్త పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ఉంటుంది. దీంతో మళ్లీ దుకాణం వస్తుందో లేదోననే భావనలో ఉన్న వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. పండగ నేపథ్యంలో అందినకాడికి దండుకుంటున్నారు. 

ఎక్కడైనా అంతే...
దసరాకు మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. దీన్ని క్యాష్‌ చేసుకోవాలని భావిస్తున్న వ్యాపారులు అందరూ కలిసి సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఆర్డినరీ మద్యం ఫుల్‌ బాటిల్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌ కావడంతో వినియోగదారులు ఏ దుకాణానికి వెళ్లినా అదే రేటుకు విక్రయిస్తున్నారు. దీంతో ఏం చేయలేక అడిగినంత ఇచ్చి కొనుక్కుంటున్నారు. గ్రేటర్‌లో సాధారణంగా రోజుకు రూ.13 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. పండగ నేపథ్యంలో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు అధికాదాయం కోసం దోపిడీకి పాల్పడుతున్నారు. 

దసరా ధమాకా
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఏటా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతుంది. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలకు రెట్టింపు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. శని, ఆది వారాలు సెలవులు కావడంతో దసరాకు ముందుగానే ఊర్లకు వెళ్లే వారు మద్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో దుకాణాలు కిటకిటలాడాయి. గ్రేటర్‌లో 412 వైన్‌ షాపులు, 405 బార్లు ఉండగా దసరా పండుగతో అన్ని దుకాణాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. 

రూ.100 కోట్ల టార్గెట్‌...
2018 దసరా సందర్భంగా గ్రేటర్‌లో ఒక్క రోజు  రూ.26 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. ఈసారిగడిచిన ఏడాది కంటే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.   

చర్యలు తీసుకుంటాం
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిఘాపెంచుతాం.  – మహ్మద్‌ యాసిన్‌ ఖురేషి,ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

మరిన్ని వార్తలు