రూ.68.57 కోట్లు.. తాగేశారు

12 Oct, 2017 09:18 IST|Sakshi

సెప్టెంబర్‌లో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు

గతేడాదితో పోలిస్తే     రూ.15కోట్లు అధికం

ఏటా రూ.600 కోట్లపైనే ఆదాయం  

గుడుంబా నియంత్రణతో పెరిగిన మద్యం అమ్మకాలు

ఆదిలాబాద్‌: ప్రతీ దసరా పండుగకు ఎక్సైజ్‌ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. దసరా పండుగ ఈసారి సెప్టెంబర్‌ 30వ తేదీన వచ్చింది. వాస్తవానికి సెప్టెంబర్‌ ప్రారంభం నుంచే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. పండుగకు మరోవారం ఉందన్న సమయంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు అధికంగా సాగాయి. దీంతోపాటు పల్లెల్లోనూ మద్యం ప్రియులు బీరుతో పాటు విస్కీ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా ఒక్క సెప్టెంబర్‌లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 మద్యం దుకాణాల పరిధిలో రూ.68.57కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 55శాతం అమ్మకాలు పెరిగాయి. ఇందులో బీరు కేసుల ద్వారా రూ.17.42కోట్లు రాగా, ఐఎంఎల్‌ మద్యం కేసుల ద్వారా రూ.51.15కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో చివరి వారం రోజుల్లోనే రూ.25కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో మద్యం అమ్మకాల ద్వారా రూ.41.25కోట్లు, బీరు అమ్మకాల ద్వారా 12.34కోట్ల ఆదాయం వచ్చింది.  

చివరి నెలలోనే అధికం..  
జిల్లాలో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఓ భాగంగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ.. ఇప్పుడు రెవెన్యూ పరంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందనడానికి రోజురోజుకు పెరుగుతున్న మద్యం అమ్మకాలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం ఊహించని రీతిలో సమకూరుతోంది. ఏటా సెప్టెంబర్‌లోనే మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఉమ్మడి జిల్లాలో లక్షా 27వేల 304 మద్యం కేసులు, 93వేల 521 బీరు కేసులు అమ్ముడుపోగా, వీటి ద్వారా రూ.53.59కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షా 45వేల 388 మద్యం కేసులు, లక్షా 32వేల 26 బీరు కేసులు విక్రయించగా, వీటి ద్వారా రూ.68.57కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.15కోట్ల ఆదాయం సమకూరి 27.96శాతం ఆదాయం పెరిగింది. మద్యం కేసుల విక్రయాల్లో 14.21శాతం, బీరు కేసుల విక్రయాల్లో 41.17శాతం పెరిగింది.  

గుడుంబా తగ్గడంతోనే..  
రాష్ట్ర ప్రభుత్వం 2015లో రెండేళ్ల మద్యం పాలసీని తీసుకొచ్చింది. అంతకుముందు ప్రతీ ఏడాది జూన్‌లో మద్యం టెండర్లు నిర్వహించేవారు. అయితే 2015–17 కాల పరిమితితో ప్రభుత్వం కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో గుడుంబాను నిర్మూలించి మద్యం అమ్మకాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి గతేడాది ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ఓ వైపు దాడులు.. మరోవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో చాలా వరకు గుడుంబా తగ్గి మద్యం అమ్మకాలు పెరిగాయి. గతంలో ప్రతీ సంవత్సరం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వచ్చే ఎక్సైజ్‌ ఆదాయం 2015 నుంచి ప్రతీ ఏడాది రూ.700 కోట్లు దాటుతోంది. ఈ లెక్కన ఎక్సైజ్‌ ఆదాయం పెరగడానికి గుడుంబా నియంత్రణ కూడా కారణమని చెప్పవచ్చు.   

గుడుంబా నియంత్రణతోనే..
ఉమ్మడి జిల్లాలో చాలా వరకు గుడుంబాను నియంత్రించాం. దీంతోనే మద్యం అమ్మకాలు పెరిగి ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించాం. ప్రజల్లో చైతన్యం వచ్చింది.    – రమేశ్‌రాజ్, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

మరిన్ని వార్తలు