ఐదు రోజులు.. రూ.8 కోట్లు

12 May, 2020 11:40 IST|Sakshi
వైన్స్‌ వద్ద బారులు తీరిన మందుబాబులు (ఫైల్‌)

జోరుగా మద్యం అమ్మకాలు

మామూలు కంటే రెట్టింపు స్థాయిలో..

పాత సరుకు.. కొత్త ధర

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈనెల 6నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోగా, ఐదు రోజుల్లోనే రూ.8 కోట్ల ఆదాయం వచ్చింది. మామూలు రోజుల కంటే రెట్టింపు స్థాయిలో విక్రయాలు సాగుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద ఇప్పటికీ మందుబాబులు బారులు తీరుతున్నారు. మళ్లీ దుకాణాలు మూతపడుతాయని ముందు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలు చేసిన సరుకు ఆధారంగా..
డిపోల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు ఆధారంగా ఆ రోజు విక్రయాలను పరిగణలోకి తీసుకుంటారు. జిల్లాలో మద్యం వ్యాపారులు ఉట్నూర్‌ డిపో నుంచి సరుకు తీసుకువస్తారు. ఈనెల 6న మద్యం విక్రయాలు ప్రారంభం కాగా, ఆ రోజు ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) అసలు ఎవరు కొనుగోలు చేసినట్టు లేదు. బీర్‌ కేసులు మాత్రం 24వేలు మాత్రమే ఉన్నాయి. ఇక తర్వాత రోజు నుంచి ఐఎంఎల్‌ కేసులు ఎక్కువగా కొనుగోలు చేయగా, బీర్‌ కేసులు తగ్గాయి.

పాత సరుకు.. కొత్త ధర
జిల్లాలో మొత్తం 31 వైన్స్‌ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. మద్యం బాటిళ్లపై పాత ఎంఆర్‌పీ ధరలు ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారంగా అమ్ముతున్నారు. ఉదాహరణకు.. నాకౌట్‌ బీరు పాత ఎంఆర్‌పీ ధర రూ.130 ఉండగా, కొత్త ధర రూ.160తో విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పుడు తొమ్మిది భారీ వాహనాలతో వచ్చిన లిక్కర్‌ను ఉట్నూర్‌ డిపో వద్దే నిలిపి ఉంచారు. అదే సరుకును ప్రస్తుతం వైన్స్‌లు తెరుచుకున్న తర్వాత విక్రయించడం జరిగింది. అయితే పాత ధర వాటిపై ఉన్నప్పటికీ ప్రభుత్వం పెంచిన కొత్త ధర ప్రకారం విక్రయాలు జరుపుకోవచ్చని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు మూసి వేయగా అక్రమంగా ఐఎంఎల్‌ లిక్కర్‌ను దొడ్డిదారిన వ్యాపారులు విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వ్యూహాత్మకంగా వ్యాపారులు 6న డిపో నుంచి ఐఎంఎల్‌ కొనుగోలు చేయకుండా, పాత సరుకును విక్రయించినట్టు చూపించడం ద్వారా ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారు. బీరు స్టాక్‌ను మొదటి రోజు జిల్లాలో 4,833 కేసులు తీసుకోవడం జరిగింది. ఐఎంఎల్‌ మాత్రం ఆరోజు జీరో ఉండడం గమనార్హం.

డిమాండ్‌ ఉన్న బీర్ల కొరత
ప్రస్తుతం వేసవి కావడంతో మందుబాబులు బీరు తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వారు డిమాండ్‌ చేస్తున్న బ్రాండ్‌ బీర్లు జిల్లాలో ఎక్కడ దొరకదు. వ్యాపారులు సిండికెట్‌ అయి ఇతర బ్రాండ్‌ బీర్లను ప్రోత్సహించేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఇతర బ్రాండ్‌ బీరు కేసుపై అదనంగా రూ.30 కమీషన్‌ వస్తోంది. ఈ అక్రమ వ్యవహారాన్ని లిక్కర్‌ కింగ్‌లు బాగానే మేనేజ్‌  చేశారు.

ధరల పట్టిక ప్రదర్శించాలి
మద్యం దుకాణాల వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలి. ఆ పట్టికలో సూచించిన ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాత సరుకు అయినప్పటికీ ప్రభుత్వం పెంచిన ధర ప్రకారం ప్రస్తుతం విక్రయిస్తున్నారు. మద్యం డిస్టిలరీస్‌ నుంచి వచ్చే సరుకునే యజమానులు కొనుగోలు చేస్తున్నారు.– రవీందర్‌రాజు, డీపీఈవో, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా