విచ్చలవిడిగా  బెల్ట్‌ షాపుల నిర్వహణ

20 Jul, 2018 14:24 IST|Sakshi
ఆటోలో బెల్ట్‌షాపులకు తరలిస్తున్న మద్యం

అక్రమార్జనకు వ్యాపారుల ఆసక్తి

రాష్ట్రం దాటుతున్న సరుకు

అంతర్రాష్ట్ర వంతెన  ద్వారా రవాణా

 నియంత్రించలేకపోతున్నఎక్సైజ్‌ శాఖ

ఒకప్పుడు మైదాన ప్రాంతాలకే పరిమితమైన బెల్ట్‌ షాపులు ఇప్పుడు ఏజెన్సీలోని అటవీ గ్రామాలకు సైతం విస్తరించాయి. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిగా నివారించలేకపోతున్నారు. రాష్ట్రం దాటి సరిహద్దు రాష్ట్రానికి సైతం ‘బెల్ట్‌ దందా’ విస్తరించింది. ప్రభుత్వం గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి వారిని మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తుండగా.. మరో వైపు ఆ స్థానాన్ని బెల్ట్‌ షాపులు భర్తీచేస్తున్నాయి.

సాక్షి, భూపాలపల్లి: పల్లెల్లో జోరుగా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా తయారీకి చెక్‌పెట్టడంతో గ్రామాల్లో మద్యం దుకా ణాల జోరు కొనసాగుతోంది. మండల కేంద్రాల్లోనూ బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. మారుమూ ల ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు ఇవి విస్తరిస్తున్నాయి. వ్యాపారులు ప్రజల ను మత్తుతో ముంచి కాసులను వెనకేసుకుంటున్నారు. 

ఏజెన్సీలో జోరుగా..

ఏజెన్సీలోని గ్రామాల్లో మద్యం దుకాణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క ఏటూరునాగా రం మండలంలోనే 70 నుంచి 80 బెల్ట్‌ షాపులు వెలిశాయి. ఇంతకు ముందు అటవీ గ్రామాల్లో గుడుంబా వినియోగం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయంతో ఇతర జీవన మార్గాలను  కల్పించింది.

ప్రభుత్వ ప్రయత్నం కొంతమేరకు ఫలించినా గుడుంబా తయారీ స్థానాన్ని ప్రస్తుతం బెల్ట్‌షాపులు ఆక్రమించాయి. తాడ్వాయి, ఏటూరునాగరారం, మహదేవపూర్, ములుగు మండలాల పరిధి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌ షాపులకు మండల కేంద్రాల నుంచి మద్యం సరఫరా అవుతోంది.

రాష్ట్రం దాటుతున్న సరుకు..

పల్లెల్లోనే కాదు జిల్లా నుంచి మద్యం సరిహద్దు రాష్ట్రం చేరుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవపూర్‌ కేంద్రాలుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ మద్యనిషేధం ఉండటం జిల్లాలోని మద్యం వ్యాపారులకు కలిసివస్తోంది. సరిహద్దులో ఉండే ఓ మద్యం దుకాణానికి వేలంలో అత్యధిక ధర పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎండాకాలం గోదావరి ఉధృతి ఉండని సమయంలో సరిహద్దు మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి నుంచి మద్యం ఎక్కువగా మహారాష్ట్రకు తరలించేవారు.

మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట గ్రామం ద్వారా ప్రాణహిత నది దాటి నేరుగా మహారాష్ట్రలోని సిరొంచకు చేరేది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఉండటం, తాత్కాలికంగా గోదావరి నదిలో వేసిన రోడ్లు కొట్టుకుపోవడం సరిహద్దుల్లో ఉండే మద్యం దుకాణాలకు కాసుల వర్షం కురుస్తోంది. అంతర్రాష్ట్ర వంతెన ద్వారా నిత్యం లక్షల రూపాయల విలువైన మద్యం సరిహద్దు దాటుతోంది. మరోవైపు మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి కేంద్రంగా మహారాష్ట్రకు మద్యం సరఫరా అవుతోంది.  

ఎనీ టైం మందు..

బెల్ట్‌ షాపులన్నీ ఎనీ టైం మందు అనే పద్ధతిలో నడుస్తున్నాయి. మద్యం దుకాణాలు మూసిన తర్వాత తెల్లవారుజాము 2 నుంచి 3 గంటల వరకు మందుబాబులకు మద్యం దొరుకుతోంది. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలు లేకుండా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో మద్యాన్ని అమ్ముతున్నారు. తలుపు తట్టి పలానా వాడిని వచ్చానంటే ఏ టైంలోనైనా మద్యం ఇస్తున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం మద్యం వ్యాపారులు కొత్తదారులను వెతుకుతున్నారు.

తెల్లవారుజామున గ్రామాల్లో తిరిగి బెల్ట్‌షాపులకు మద్యాన్ని డంప్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇదే కాకుండా బెల్ట్‌షాపుల నిర్వాహకులకు మద్యం వ్యాపారులు కొత్తగా అప్పులు ఇచ్చి మద్యం అమ్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సంబంధిత అధికా>రులకు తెలిసినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకొని మా జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.

1600 బెల్ట్‌ షాపులు..!

జిల్లాలో మొత్తం మండలాలు 20 ఉండగా మద్యం షాపులు 55 ఉన్నాయి. బెల్ట్‌ షాపులు మండలానికి 70 నుంచి 80 వరకు ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1400 నుంచి 1600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఆదాయం అధికంగా వస్తుండడంతో బెల్ట్‌ షాపులను విచ్చల విడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. 

నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం

జిల్లాలో బెల్ట్‌షాపులను నియంత్రించేందుకు ఎక్సై జ్‌ శాఖ కృషి చేస్తోంది. వీటితోపాటు అనుమతి లేకుండా మద్యం అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–  శశిధర్‌రెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు