మావోల కదలికలపై అప్రమత్తం

2 Oct, 2018 04:16 IST|Sakshi

డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, కొత్తగూడెం/ భూపాలపల్లి: దండకారణ్యం ఆవరించి ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, సమీపంలోని ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల పోలీసు యంత్రాంగం ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం 4 జిల్లాల పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అరకులో చోటుచేసుకున్నటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. విధుల్లో ఏమాత్రం తేడా వచ్చినా మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పోలీసు స్పెషల్‌ పార్టీ, ఆపరేషన్‌ టీంలతో పాటు జిల్లాల ఎస్పీలు స్పెషల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు.  ఏజెన్సీలో పర్యటించే నేతల వివరాలు తెలుసుకుంటూ వారి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

సామాజిక పోలీసింగ్‌ విధానంతో రక్షణ చర్యలు 
సామాజిక పోలీసింగ్‌ విధానంతో రక్షణ చర్యలు చేపడతామని మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ఎన్నికల కేంద్రాల వద్ద లోకల్‌ పోలీస్‌లు, పారామిలటరీ, స్పెషల్‌ ఫోర్స్, గ్రేహౌండ్స్‌ బలగాలతో సమ న్వయం చేసుకుంటూ భద్రతను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. సమావేశంలో నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్సీ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు, రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు