కేబినెట్లో మంత్రులందరూ సమానమే

27 Apr, 2016 03:26 IST|Sakshi
కేబినెట్లో మంత్రులందరూ సమానమే

నిజామాబాద్ ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మండలిలో మంత్రులందరూ సమానమేనని.. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావు నడుమ ఎలాంటి వివక్ష లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మంత్రుల శాఖల మార్పిడి కి చిలువలు, పలువలు చేర్చి విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కవిత విలేకరులతో మాట్లాడారు. సుపరిపాలన అందించేందుకు శాఖల మార్పిడి చేశారు తప్పా.. ఎలాంటి ప్రత్యేకతా లేదన్నారు. ఓటమి భయంతోనే పాలేరు ఉప ఎన్నికలో విపక్షాలు ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

గతంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. డిపాజిట్ గల్లంతవుతుందనే భయం తో విపక్షాలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తమను మద్దతు ఇవ్వాలని సంప్రదించడం సరికాదన్నారు. తమ పార్టీ విధానం మేరకే పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నామని.. పాలసీని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ కట్టిందన్నారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహణపై విపక్షాలు అభ్యంతరాలు తెలపడం హాస్యాస్పదమని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నాకే సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని కవిత గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు