లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూముల రీ అసైన్‌

12 Feb, 2018 03:24 IST|Sakshi

అసైన్డ్‌పై ఆర్డినెన్స్‌

రాష్ట్రంలో అసైన్డ్‌ భూములు - 22.63 లక్షల ఎకరాలు

ఆక్రమణదారులు - 84,706

గ్రామాల్లో ఆక్రమణలు - 60 శాతం

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో తెలుగు తప్పనిసరిపై మరో ఆర్డినెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పరాధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను రీ అసైన్‌ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఈ మేరకు ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్‌ తీసుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అసైన్డ్‌ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్‌ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా ఈ కటాఫ్‌ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్‌ 2 నాటికి అసైన్డ్‌ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి.. వారి పేరిట రీ అసైన్‌ చేస్తారు. అందుకు అనుగుణంగా తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌(ప్రొహిబిష¯Œన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) యాక్ట్‌– 977లో పలు నిబంధనల్ని సవరించటం తప్పనిసరి. అందుకే అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 12కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పేద వర్గాలకు రీ అసైన్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుపై వచ్చే వారమే ఆర్డినెన్స్‌!
అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇంటర్నేషనల్‌ స్కూళ్లన్నింటా తెలుగును తప్పనిసరి చేసేలా ఈ ఆర్డినెన్స్‌ ఉంటుంది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే దీనికి చట్టరూపం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్డినెన్స్‌ను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్డినెన్స్‌ ముసాయిదా న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గవర్నర్‌ ఆమోదంతో వచ్చే వారంలో ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు