మార్గం సుగమం

7 May, 2019 07:29 IST|Sakshi

ఎస్సార్‌డీపీ పనులకు తొలగిన అడ్డంకులు  

హెచ్‌టీ లైన్ల తరలింపునకు విద్యుత్‌ శాఖ అనుమతి  

టీఎస్‌ ట్రాన్స్‌కోకు రూ.115 కోట్లు చెల్లించిన జీహెచ్‌ఎంసీ  

పూర్తయిన టెండర్లు.. పనులు ప్రారంభం  

శరవేగంగా రూ.750 కోట్ల విలువైన ప్రాజెక్టులు  

సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) పనుల్లో భాగంగా చేపట్టిన మూడు కీలకమైన ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. ఆయా మార్గాల్లో పనులకు అడ్డంకిగా మారిన ఓవర్‌ హెడ్‌లైన్ల తరలింపునకు విద్యుత్‌ శాఖ అనుమతినిచ్చింది. దీంతో రూ.750 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులు శరవేగంగా జరగనున్నాయి. షేక్‌పేట నుంచి విస్పర్‌వ్యాలీ (మహాప్రస్థానం) వరకు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుల నుంచి దుర్గం చెరువు కేబుల్‌ స్టే బ్రిడ్జి వరకు, కొత్తగూడ, కొండాపూర్‌ మార్గాల్లో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణానికి జీహెచ్‌ఎంసీ ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఇవి పూర్తయితే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ, నాలెడ్జ్‌ సిటీల వైపు రాకపోకలు సాగించే వారికి... ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి మియాపూర్‌ వరకు కూడా రాకపోకలు సాగించే వారికి ఎంతో సదుపాయంగా ఉంటుంది. నిత్యంఈ మార్గాల్లో ప్రయాణించే లక్షల మందికి ట్రాఫిక్‌ నరకం తప్పుతుంది.

ఈ ఉద్దేశంతోనే ఎస్సార్‌డీపీలో భాగంగా ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే పనులు పురోగతిలో ఉన్నప్పటికీ, పూర్తి చేసేందుకు ఆయా మార్గాల్లో టీఎస్‌ ట్రాన్స్‌కోకు చెందిన 220 కేవీ, 132 కేవీ ఓవర్‌ హెడ్‌లైన్లను మళ్లించాల్సి వచ్చింది. వాటిని భూగర్భంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ అధికారులు దాదాపు ఏడాదిన్నరగా కసరత్తు చేస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు మార్గం సుగమమైంది. జీహెచ్‌ఎంసీ వాటి తరలింపు పనులకయ్యే దాదాపు రూ.115 కోట్లను ట్రాన్స్‌కోకు చెల్లించింది. ట్రాన్స్‌కో పనులు ప్రారంభించిందని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ ప్రాజెక్టుల సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తెలిపారు. ట్రాన్స్‌కో ఓవర్‌ హెడ్‌లైన్‌ తరలింపు పనులు పూర్తయ్యేలోగా, దానికి సమాంతరంగా మిగిలిన ఆస్తుల సేకరణ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ మార్గాల్లో ఆయా పనులు జరుగుతున్నప్పటికీ  ఓవర్‌ హెడ్‌లైన్ల మళ్లింపు, ఆస్తుల సేకరణ కూడా పూర్తయితే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పనులు త్వరితగతిన పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.  

ఇవీ ప్రాజెక్టులు 
షేక్‌పేట – మహాప్రస్థానం ఫ్లైఓవర్‌  సెవెన్‌ టూంబ్స్‌ జంక్షన్, ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌ వ్యాలీ జంక్షన్లను కలిపే  ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ ఇది. దీని ద్వారా రెండువైపులా రాకపోకలు సాగించొచ్చు.  అంచనా వ్యయం: రూ.333.55 కోట్లు  
బొటానికల్‌ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్‌ ఫ్లైఓవర్లు/ గ్రేడ్‌ సెపరేటర్లు.   అంచనా వ్యయం: రూ.263.09 కోట్లు  
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌ స్టే బ్రిడ్జిని కలిపే ఎలివేటెడ్‌ కారిడార్‌. అంచనా వ్యయం: రూ.150 కోట్లు 

మరిన్ని వార్తలు