ఒకే చోట.. చక్కటి విద్య !

15 Mar, 2015 01:44 IST|Sakshi
ఒకే చోట.. చక్కటి విద్య !

*  ఒకే యాజమాన్యం కిందకు గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు
*    భవిష్యత్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దే అవకాశం
*    కేంద్రం మోడల్ స్కూళ్లను రద్దు చేయడంతో విద్యాశాఖ యోచన
*   మోడల్ స్కూళ్లనే ‘కేజీ టు పీజీ’గా మార్చితే మంచిదంటున్న విద్యావేత్తలు

 
రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న గురుకులాలు, కొత్తగా ప్రారంభించిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు వంటివాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2016-17 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన ‘కేజీ టు పీజీ’ విద్యాసంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ పాఠశాలలన్నింటికీ పెద్ద భవనాలు, హాస్టళ్లు ఉండడం, ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతుండడం వంటివన్నీ ‘కేజీ టు పీజీ’కి సరిగ్గా సరిపోతాయని.. ఒకే యాజమాన్యం పరిధిలోకి తేస్తే మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సర్కారు అభిప్రాయ పడుతోంది.                  
 - సాక్షి, హైదరాబాద్
 
 అన్ని హంగులతో.. మండలానికి ఒకటి
కేజీ టు పీజీకి కాన్సెప్ట్ పేపర్ రూపకల్పన కోసం విద్యాశాఖ రెండు దఫాలుగా విద్యావేత్తలు, అధికారులతో సమావేశాలు నిర్వహించింది. నివాస వసతితో కూడిన విద్యా సంస్థలను, కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లను, గురుకులాలను, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను తీసుకువస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సమావేశాల్లో విద్యావేత్తలు వ్యక్తం చేశారు. తద్వారా మండలానికి ఒకటి చొప్పున కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేయడం సులభమవడంతోపాటు వాటి నిర్వహణ పక్కాగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

దానికితోడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లుగా ఇంగ్లిష్ మీడియంతో కూడిన నాణ్యమైన విద్యను అందించవచ్చని చెప్పారు. విద్యాశాఖ గతంలో ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను ప్రారంభించినా... వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్యను అందించలేని స్కూళ్లుగా అవి తయారయ్యాయి. ఈ నేపథ్యంలో మోడల్, గురుకుల, కస్తూర్బా విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కేజీ టు పీజీ కేంద్రాలుగా తీర్చిదిద్దితే బాగుంటుందన్న ఆలోచనలు అధికారుల్లో వచ్చాయి.
 
 రకరకాల పేర్లతో..
రాష్ట్రంలో ప్రస్తుతం 400 వరకు గురుకుల విద్యాలయాలున్నాయి. అందులో 47 గురుకులాలు, 4 కాలేజీలు విద్యాశాఖకు చెందిన రాష్ట్ర గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లు సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉన్నాయి. మరోవైపు బాలికలకు నివాస వసతితో కూడిన విద్యను అందించే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) కూడా 95 ఉన్నాయి. ఇవి గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతుండగా.. కొన్ని సర్వశిక్షా అభియాన్ పరిధిలో, ఇంకొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇక మరోవైపు 192 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే పక్కాగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేజీ నుంచి 3వ తరగతి వరకు డే స్కూల్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించే విద్యాలయాలుగా మార్చవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
 
అనువుగా ‘మోడల్’ భవనాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 177 మోడల్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. మరో 15 స్కూళ్ల భవనాలు సిద్ధమయ్యాయి. వచ్చే జూన్‌లో వాటిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటికి తోడు కేంద్రం రెండో దశలో మరో 125 మోడల్ స్కూళ్లను ఇచ్చింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ. 4.85 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. రూ. 100 కోట్ల నిధులూ ఇచ్చింది. కానీ తాజా బడ్జెట్‌లో కేంద్రం ఈ పథకాన్ని పక్కనపెట్టింది. అయితే గతంలోనే 125 స్కూళ్లను మంజూరు చేసి, కొంతమేర నిధులిచ్చినందున మిగతా నిధులిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మరో రూ. 650 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఎలాగూ కేజీ టు పీజీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో స్థలాలు సిద్ధంగా ఉన్న మోడల్ స్కూళ్లనే కేజీ టు పీజీ కేంద్రాలుగా నిర్మిస్తే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టల్‌కు కేంద్రమే నిధులిచ్చినందున.. బాలుర హాస్టళ్లకు నిధులను వెచ్చిస్తే చాలు.
 
 రకరకాల మేనేజ్‌మెంట్లు అవసరం లేదు
‘‘స్కూళ్లకు రకరకాల మేనేజ్‌మెంట్లు అవసరం లేదు. పేరు ఏదైనా నిధులను ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నిర్వహించాల్సింది విద్యాశాఖే. అందుకే కేజీ టు పీజీలో ఇలాంటి స్కూళ్లు అన్నీ ఒకే మేనేజ్‌మెంట్ పరిధిలో ఉండాలి. కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. అన్నింటి పరిధిలో నివాస వసతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది.’’     
 - చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త

 
 ఒకే రకంగా సర్వీసు రూల్స్
 ‘‘ప్రస్తుతం గురుకులాలకు మోడల్ స్కూల్ టీచర్లకు ఒకే రకమైన సర్వీసు రూల్స్ ఉన్నాయి. పైగా మోడల్ స్కూళ్లలో బాలికలకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. అదనంగా బాలురకు హాస్టల్ వసతి కల్పించి కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాలు అన్ని ఒకే పరిధిలోకి తేవాలి.’’    
 - ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి,
 ఎస్‌సీఈఆర్‌టీ కరిక్యులమ్ మాజీ విభాగాధిపతి

మరిన్ని వార్తలు