ఆ ఊర్లో ఎన్నికలన్నీ ఏకగ్రీవమే..

7 Jan, 2019 09:40 IST|Sakshi

ఆదర్శం.. మంగళపల్లి పంచాయతీ గ్రామస్తులు

ఎన్నిక ఏదైనా.. అభ్యర్థి ఒకరే..

గత పంచాయతీ ఎన్నికలకు ముందు అది అనుబంధ గ్రామం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటే తమ గ్రామ అభ్యర్థిని ఒక్కరినే నిలబెట్టడం ఆనవాయితీ. పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్న గ్రామంలో వంద ఓట్లు అధికంగా ఉన్నా.. సర్పంచ్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో అనుబంధ గ్రామస్తులే గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఒకే అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి సర్పంచ్‌ స్థానంతో సహా వార్డు పదవులన్నీ ఏకగ్రీవం చేసి మంగళపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు.

చొప్పదండి: నియోజకవర్గంలోనే తొలిసారి ఏర్పడిన గ్రామ పంచాయతీకి పాలకవర్గం ఏకగ్రీవం చేసుకొని ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా మారారు మంగళపల్లి గ్రామ ఓటర్లు. గతంలో 2013 పంచాయతీ ఎన్నికల వరకు చిట్యాలపల్లి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మంగళపల్లి 2013 సంవత్సరంలో ప్రత్యేక పంచాయతీ హోదా పొందింది. గ్రామస్తులు ఒకే మాట, ఒకే బాటలో నడవడంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన స్థానాలకు ప్రభుత్వం ఇచ్చే నజరానాలూ పొందింది.

రెండున్నర దశాబ్దాల పోరాటం..
మంగళపల్లిని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులు రెండున్నర దశాబ్దాలుగా పోరాడారు. తమ ఆశలు నెరవేరకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్‌ స్థానం కోసం గ్రామం నుంచి ఒక్కరినే అభ్యర్థిగా నిలబెడుతూ వచ్చారు. మండల వ్యవస్థ ఏర్పడిన అనంతరం చిట్యాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా చిట్యాలపల్లి, మంగళపల్లి గ్రామాల మధ్య జరిగిన ‘పంచాయతీ’ పోరులో మంగళపల్లి గ్రామస్తులే గెలుస్తూ వచ్చారు. చిట్యాలపల్లిలో వంద ఓట్ల వరకు అదనంగా ఉన్నా.. సర్పంచ్‌ ఎన్నికల బరిలో గెలిచేది మంగళపల్లి అభ్యర్థులే కావడం గమనార్హం. 1989లో వెల్మ తిరుపతిరెడ్డి, 1996లో గాండ్ల శ్రీనివాస్, 2001లో పెద్దిళ్ళి బక్కమ్మ, 2006లో వెల్మ శ్రీనివాస్‌రెడ్డి మంగళపల్లి గ్రామం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1996లో వెల్మ మల్లారెడ్డి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచి అయిదేళ్లపాటు ఎంపీపీగా పని చేశారు. ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసిన కొత్త గ్రామ పంచాయతీల్లో మంగళపల్లిని చేర్చడంతో గ్రామస్తుల సొంత ‘పంచాయతీ’ కల నెరవేరింది.

అదే స్ఫూర్తితో ఏకగ్రీవం
గత ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటు చేసిన మంగళపల్లి గ్రామ పంచాయతీని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇరువురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా, ఇద్దరు బంధువులే కావడంతో ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో పెద్దెళ్ళి అంజమ్మ ఒక్కరే బరిలో మిగిలడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గ్రామంలో ఎనిమిది వార్డులుండగా.. అన్ని స్థానాల్లోనూ ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు చేశారు. 

మరిన్ని వార్తలు