ఒకే వెబ్‌సైట్ ద్వారా అన్ని ప్రవేశాలు!

17 Sep, 2016 01:55 IST|Sakshi
ఒకే వెబ్‌సైట్ ద్వారా అన్ని ప్రవేశాలు!

కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి
- ఇప్పటికే ప్రధాన వెబ్‌సైట్ రూపకల్పన
- కాలేజీల వారీగా వివరాలు అందులోనే..
- విద్యార్థులందరి సమగ్ర వివరాలు కూడా..
- స్టూడెంట్ వెరిఫికేషన్ పేరుతో ప్రత్యేక లింకు
- నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసే చర్యలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కో వెబ్‌సైట్ ద్వారా ఒక్కో ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్న సెట్ కమిటీలన్నీ... ఇకపై ఒకే ప్రధాన వెబ్‌సైట్‌తో ఆ పనులన్నీ చేయనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేకంగా రూపొందిస్తున్న tsche.ac.in వెబ్‌సైట్ ద్వారానే అన్ని కోర్సుల ప్రవేశాల ప్రక్రియలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనే అన్ని కాలేజీలు, సీట్లు, కాలేజీల్లో సదుపాయాలకు సంబంధించిన వివరాలను అం దుబాటులో ఉంచనుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే ఉన్నత విద్యకు సంబంధించిన సమగ్ర వివరాలు లభించేలా రూపొందిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఇందుకు మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్‌లకు వేర్వేరు వెబ్‌సైట్‌లున్నాయి. అయితే దాదాపుగా అవే పేర్లతో, స్వల్ప తేడాలతో ప్రైవేటు వెబ్‌సైట్లు పుట్టుకురావడంతో.. విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇకపై అలాకాకుండా ఒకే ప్రధాన వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ చేపడతారు.

 నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట
 రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. త్వరలో అందుబాటులోకి తేనున్న ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లోనే స్టూడెంట్ వెరిఫికేషన్ పేరుతో అన్ని యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు చదివిన కోర్సులు, మార్కుల మెమోలు తదితర వివరాలను అందుబాటులోకి తేనుంది. గత ఐదారేళ్లలో ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జేఎన్టీయూహెచ్‌లో 2011 నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల సమగ్ర వివరాలను అందుబాటులోకి తేగా.. మిగతా వర్సిటీల నుంచి సమాచారాన్ని ఇప్పటికే తెప్పించారు. త్వరలోనే వాటిని వెబ్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. మండలి వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టూడెంట్ వెరిఫికేషన్ లింక్‌ను క్లిక్ చేయగానే http://www.tsstudentverification. org సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సర్వీసెస్ కేటగిరీలో స్టూడెంట్స్ స్కోర్/మార్కుల వెరిఫికేషన్, డిగ్రీ వెరిఫికేషన్, అటెండెన్స్ వెరిఫికేషన్ ఆప్షన్లు ఉంటాయి. వాటిని క్లిక్ చేసి విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్, కోర్సు, చదివిన సంవత్సరం వివరాలు నమోదు చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 నియామక సంస్థలు చూసుకునేలా..
 ఏదైనా నియామక సంస్థ ఉద్యోగం ఇచ్చేప్పుడుకానీ, ఉన్నత తరగతుల్లో ప్రవేశాలు పొందే సమయంలోగానీ ఆయా విద్యా సంస్థలు విద్యార్థి ఇచ్చిన సర్టిఫికెట్‌లోని వివరాలను హాల్‌టికెట్ నంబరు సహాయంతో వెరిఫికేషన్ చేసుకునే వీలు ఏర్పడుతుంది. వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలు, సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలు సరిపోలితే.. అవి సరైనవేనని నిర్ధారించుకోవచ్చు. లేకపోతే నకిలీ సర్టిఫికెట్లని తేలిపోతుంది. ఇక తక్కువ మార్కులు వచ్చినా.. విద్యార్థులు ఎక్కువ మార్కులుగా మార్చుకోవడం వంటి అవకతవకలకూ అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు