చూపంతా ‘పాలమూరు’ వైపే!

28 May, 2017 00:25 IST|Sakshi

ఈ ఖరీఫ్‌లో పూర్తి చేయాల్సినవాటిల్లో పాలమూరు జిల్లాల్లోని ప్రాజెక్టులు ముందు వరసలో ఉన్నాయి. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్‌ భీమా, కోయిల్‌సాగర్‌లను పూర్తి చేసి వాటి కింద నిర్ణయించిన మొత్తం 8.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. గతేడాది కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమా కింద 1.40 లక్షలు, కోయిల్‌సాగర్‌ కింద మరో 20 వేల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఈ ఏడాది కొత్తగా 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌లో మంచి వర్షాలు కురిసే ఆగస్టు నాటికైనా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే ఖరీఫ్‌కు సాగునీరిచ్చే అవకాశం ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, రైల్వే, రహదారుల క్రాసింగ్‌లపై దృష్టి పెట్టింది. మంత్రి హరీశ్‌రావు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు జిల్లాల్లో ‘ప్రాజెక్టు నిద్ర’ చేస్తున్నారు.

పెరగనున్న సాగు..
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉండగా.. గతేడాది వరకు గరిష్టంగా 16 లక్షల ఎకరాలకు నీరందుతూ వచ్చింది. అయితే జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తవుతుండటంతో వాటి కింద కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. 2016–17లో గరిష్టంగా 21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. ఈ ఖరీఫ్‌లో కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాలకు నీరందించ గలిగితే ప్రాజెక్టుల కింద సాగు 29 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు చేరే అవకాశం ఉంది.



మరిన్ని వార్తలు