సంక్షేమం సమర్థతకు సమ ప్రాధాన్యం

6 Sep, 2018 13:04 IST|Sakshi
కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌

‘తొలి ప్రాధాన్యత.. మలి ప్రాధాన్యత అంటూ లేదు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రాధాన్యాలే. కాకపోతే ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి విశిష్టత కలిగిన పెద్ద జిల్లా అని, ఇతర జిల్లాలతో దీనిని పోల్చలేమని, ఇక్కడ సగం సమస్యలు రెవెన్యూ అంశాలకు సంబంధించినవే ఉంటాయన్నారు. దీంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కుమార్‌ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 

–సాక్షి, రంగారెడ్డి: జిల్లా ప్రతినిధి ఇక్కడ ప్రధాన సమస్య రెవెన్యూ వివాదాలు. నగరీకరణతో ప్రభుత్వ భూములను కాపాడటం కత్తిమీద సాములాంటిది. మొన్నటి వరకు పనిచేసిన ఖమ్మం జిల్లాలో వంద కేసుల్లో కేవలం పదింటిపైనే న్యాయపరమైన చిక్కులుండేవి. 90శాతం జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి. ఇదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే వంద శాతం కోర్టుకెక్కుతున్నాయి. విలువైన భూములు కబ్జా కాకుండా రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరముంది. అక్రమార్కులు న్యాయస్థానం మెట్లెక్కకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సగం కేసులకు కళ్లెం వేయవచ్చు. 
ప్రజల దరికి సంక్షేమ ఫలాలు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం కలెక్టర్‌గా నా బాధ్యత. విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (ఫ్లాగ్‌షిప్‌) భావించే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా తదితర కార్యక్రమాలు నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటా.

ఉత్తీర్ణతా శాతం పెంపుపై ప్రత్యేక డ్రైవ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే.. ప్రతి ఉద్యోగికీ అంకితభావం, జవాబుదారీతనం ముఖ్యం. వృత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిందే. బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వెనుకబడ్డవారిని మెరుగు పరుచుకోవాలని సూచిస్తాం. అయినా, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే చర్యలకు వెనుకాడం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఉద్యోగుల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తాం. 

పమాణాలను మెరుగుపరిచేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తా. ఈ నెలాఖరు నుంచే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచే అంశంపై ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశిస్తా. నిరంతరం సమీక్షిస్తా. కేవలం చదువేగాకుండా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కూలు దుస్తులు, పుస్తకాల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ కార్పొరేట్‌ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. ప్రసూతి కేంద్రాలను పెంచడమేగాకుండా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చొరవ చూపుతా.

మరిన్ని వార్తలు