మాటల్లేవ్‌!.. జీవితం ఆన్‌లైన్‌కే అంకితం

8 Aug, 2019 11:37 IST|Sakshi

పెరుగుతున్న డేటా వినియోగం  

సిటీలో 59 శాతానికి పైగా వాడకం  

రాష్ట్రంలో అత్యధికంగా ఇక్కడే..

యువత, మహిళలే టాప్‌

తగ్గుతున్న మానవ సంబంధాలు

ఆలిండియా డేటా యూసేజ్‌

మొబైల్‌ సొసైటీ సర్వేలో వెల్లడి

సాక్షి,సిటీబ్యూరో: మహానగర ప్రజలు ఒంటరి అయిపోతున్నారు. తోటివారితో మాట్లాడేందుకు సమయం దొరకడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్య కూడా సంబంధాలు గగనమైపోతున్నాయి. ‘భోజనం చేద్దామా’ అన్న మాట కూడా ఆన్‌లైన్‌లోనే వెతుక్కుంటున్నారు. ఇటీవల నగరంపై ‘ఆలిండియా డేటా యూసేజ్‌ మొబైల్‌ సొసైటీ’ సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘నెటిజన్లు’గా మారిపోతున్న సిటిజన్లు సెల్‌పోన్లలో మూగ సందేశాలకే పరిమితమవుతున్నారని పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో చాటింగ్‌లు పెరిగిపోయాయని తేల్చి చెప్పింది. మొన్నటి వరకు మనిషికి ఆనందం వచ్చినా.. కష్టం కలిగినా తమ దగ్గరి వారితో పంచుకుని గుండె బరువు దించుకునేవారు. క్రమంగా మానవాళి మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు అందరూ వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్‌పోన్‌లో ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించే వారు ఇప్పుడు తమ ఇంటికే నేరుగా నెట్‌ కనెక్షన్‌ తీసుకుంటున్నారని సదరు సర్వే తేల్చింది.

నగరంలోనే అత్యధిక వాడకం
రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటర్‌నెట్‌ డేటా వాడుతున్న వారిలో నగర వాసులే ముందున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇక్కడ మొత్తం డేటాలో 59 శాతం వాడేస్తున్నారు. మొత్తం మీద 20 శాతం మంది 56.49 మిలియన్‌ డాటాను, 15 శాతం మంది నిరంతరం ఆన్‌లైన్‌లోనే ఉంటూ 43.04 మిలియన్‌ డాటాను  వినియోగిస్తున్నట్లు మొబైల్‌ సంస్థల సర్వేలో వెల్లడైంది. వారంలో నాలుగైదు సార్లు నెట్‌ను ఆన్‌చేసేవారు 12 శాతం మంది 32.28 మిలియన్‌ డాటాను వాడుతున్నారు. వారానికి రెండుసార్లు వాడేవారు 14 శాతం మంది, వారానికి ఒకసారి ఎనిమిది శాతం మంది, నెలకు రెండు సార్లు నెట్‌ వాడే వారు 5 శాతం ఉన్నట్టు చెబుతున్నాయి.  

యువత, మహిళలే టాప్‌
నిత్యం డేటా వినియోగంలో యువత, మహిళలు ముందున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రతిరోజు 36 శాతం యువత, మహిళలు ఆన్‌లైన్‌లో తెగ బిజీగా ఉంటున్నట్టు తేల్చారు. వారి తర్వాత 24 శాతం కాలేజీ విద్యార్థులు, 19 శాతం స్కూల్‌ పిల్లలు, 15 శాతం వృద్ధులు, 8 శాతం వర్కింగ్‌ ఉమెన్స్‌ డేటా వాడుతున్నట్టు గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంమీద 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు డేటాను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.  

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ టాప్‌
ఇంటర్నెట్‌ వినియోగంలో 69 శాతం సోషల్‌ నెట్‌వర్కింగ్, 67 శాతం ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్స్, 50 శాతం ఎంటర్‌టైన్‌మెంట్, 34 శాతం ఆన్‌లైన్‌ షాపింగ్, 27 శాతం ఆన్‌లైన్‌ సర్వీస్‌కు వినియోగమవుతోంది. అయితే, డేటా అత్యధిక వినియోగమంలో స్మార్ట్‌ ఫోన్లు టాప్‌గా ఉన్నట్లు గాణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా 73 శాతం, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ ద్వారా 20 శాతం, టాబ్లెట్‌ ద్వారా 7 శాతం డేటాను వాడుతున్నట్టు సర్వేలో తేలిది.  

గృహ వినియోగమూ అధికమే..  
సిటీలో గృహాల్లో ఉన్నవారు వాడే డేటా కూడా తక్కువేమీ కాదు.. గత ఐదేళ్లలో 50 శాతం నుంచి 88 శాతానికి వినిగోం పెరగగా, సైబర్‌ కేఫ్‌ల డేటా 40 శాతం నుంచి 10 శాతానికి పడిపోయింది. దీన్నిబట్టి మహిళలు అత్యధికంగా డేటా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ నగరంలో 15 శాతం మంది ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నట్టు సర్వే తేల్చింది. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో దూరంగా ఉంటున్నట్టు గుర్తించారు.  

మొబైల్స్‌ వాడకం 30 లక్షలకు పైనే  
మహానగరంలో జనాభా కోటికి పైగానే ఉంది. అందులో సుమారు 30 లక్షల మంది వరకు మొబైల్‌ వినియోగిస్తున్నట్లు తేల్చారు. కొందరు రెండు, మూడు కనెక్షన్లు వాడుతున్నట్టు సమాచారం. బీఎస్సెన్‌ఎల్‌తో పాటు ఐడియా, ఎయిర్‌టెల్, జియో వంటి పేరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు సంస్థలు ఇంటర్నెట్‌ సర్వీసులు అందిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సిటీలో మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఐదేళ్ల  మార్కెటింగ్‌ సరళిని పరిశీలిస్తే మొబైల్‌ కొనుగోళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వివిధ కంపెనీల స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో రావడంతో 200 శాతం మేర మొబైల్స్‌ అమ్మకాలు వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. గతేడాదిలో వివిధ కంపెనీల మొబైల్స్‌ 51 లక్షల వరకు అమ్ముడుపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు