ర్యాంకుల గిరిపుత్రుడు

10 Jun, 2018 00:19 IST|Sakshi

జిప్‌మర్‌లో ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు

గతంలోనూ పలు ర్యాంకులు సాధించిన జన్నారం విద్యార్థి

జన్నారం (ఖానాపూర్‌): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పరీక్షల్లో ర్యాంకులు పొంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఈ గిరిపుత్రుడు. నీట్‌లో ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన ఇతను ఇప్పుడు జిప్‌మర్‌లో ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు ౖకైవసం చేసుకుని తన సత్తా చాటాడు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం రూప్‌నాయక్‌ తండాకు చెందిన లావుడ్యా హరిరాం, హారిక దంపతుల కుమారుడు హర్షవర్దన్‌. శుక్రవారం విడుదలైన జిప్‌మర్‌ ‡(జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) ప్రవేశ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు.

చురుకైన విద్యార్థి
హర్షవర్దన్‌ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌ బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధిం చాడు. ఇటీవల కేవీపీవై (కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన) 2018 పరీక్షలో అఖిల భారత స్థాయి లో 35వ ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్‌ అక్క హరిప్రియ జైపూర్‌ నిట్‌ (జాతీయ విజ్ఞాన సంస్థ)లో ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్‌ కోర్సు చేస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది.

తండ్రి స్ఫూర్తితో క్రీడల్లోనూ..  
హర్షవర్దన్‌ క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తండ్రి లావుడ్యా హరిరాం గురుకుల కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం ఆయన పీహెచ్‌డీ చేస్తున్నారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రుడు హర్షవర్దన్‌ ఇటీవలే ఎయిమ్స్‌ ఎంట్రన్స్‌ కూడా రాశాడు. అందులోనూ మంచి ర్యాంకు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా