అల్ విదా రంజాన్...

26 Jul, 2014 00:43 IST|Sakshi
అల్ విదా రంజాన్...

సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: జుమ్మతుల్ విదాను పురస్కరించుకొని మక్కా మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. మక్కామసీదు ప్రాంగణంతో పాటు చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, చార్మినార్ బస్ టెర్మినల్ రోడ్లపై ఏర్పాటు చేసిన కార్పెట్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఈ సామూహిక ప్రార్థనలకు ‘అజాన్’ను మహ్మద్ హనీఫ్ పలుకగా... మక్కా మసీదు ఇమామ్ హఫేజ్ మహ్మద్ రిజ్వాన్ ఖురేషీ నమాజ్ చేయించారు.

అనంతరం మక్కా మసీదు కతీబ్ హఫేజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి దువా చేశారు. జుమ్మతుల్ విదా కోసం ఆయా మసీదుల్లో ప్రముఖ మతగురువులు జుమా ఖుత్బ పఠించారు. జుమా నమాజ్ అనంతరం ఆయా మసీదుల్లో రంజాన్, ఉపవాసాలు, జకాత్, లైలతుల్ ఖదర్ ప్రాముఖ్యత గురించి ముఫ్తిలు, ఉలేమాలు ప్రసంగించారు.

ఈ ప్రార్థనలలో గ్రేటర్ మేయర్  మాజిద్ హుస్సేన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ మహ్మద్ అల్తాఫ్ రిజ్వీతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
 
ఘనంగా షబే ఖదర్
 
షబే ఖదర్ సందర్భంగా నగరంలోని అన్ని మసీదులలో శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నగరంలోని మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ముస్లింలు సోదరులు షబే ఖదర్‌ను పురస్కరించుకొని తరావీ నమాజ్‌లు, నఫీల్ నమాజ్, తాహజుద్ నమాజ్‌లను సామూహికంగా నిర్వహించారు. అనంతరం మసీదుల్లో తరావీ నమాజుల్లో ఖురాన్ పఠించిన హఫెజ్‌లకు సన్మనించారు. ఈ సందర్భంగా మత పెద్దలు షబే ఖదర్ ప్రాముఖ్యత గూర్చి తెలిపారు.

రంజాన్‌మాసంలో షబ్బే ఖదర్ రాత్రి దివ్య ఖురాన్ అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదుల్లో ఖురాన్ ప్రాముఖ్యతను మతగువులు, ముఫ్‌తీలు వివరించారు. ఈ రాత్రి చేసిన కర్మలకు వెయ్యి రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని భావించి ఎక్కువగా దైవ స్మరణలో గడుపుతారని ముఫ్తీ మస్తాన్ అలీ తెలిపారు.                                         

మరిన్ని వార్తలు