ఒంటరినైపోయా..!

15 Mar, 2014 02:09 IST|Sakshi

 కొత్తగూడెం, న్యూస్‌లైన్:  కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ఏకాకులయ్యాయి. ఈ రెండు పార్టీలతో కలిసి పని చేసేందుకు మిగిలిన పార్టీలు విముఖత చూపడంతో చివరకు ఒంటరిగానే బరిలో దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీపీఐ, టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ నాయకులు పొత్తులపై అంగీకారానికి వచ్చాయి.

అలాగే వైఎస్సార్‌సీపీ - సీపీఎంలు పొత్తు కుదుర్చుకుని బరిలో దిగుతోంది. రాష్ట్రంలో సయోధ్య కుదిరితే టీఆర్‌ఎస్ తమకు మద్దతు ఇస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుని రెండు సార్లు మున్సిపాలిటీని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి విజయఢంకా మోగించింది. 2005లో జరిగిన ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 17 వార్డులతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకుంది.

 వార్డులో నెలకొన్న అసంతృప్తి..
 కాంగ్రెస్ పార్టీ 2005 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ వార్డుల్లో అభివృద్ధిపై కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. రెండు పర్యాయాలు మున్సిపాలిటీలో పాగా వేసిన కాంగ్రెస్ ప్రధాన సమస్యల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం వల్ల తమకు లాభం చేకూరదనే నేపథ్యంలో మిగిలిన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసేందుకు విముఖత చూపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సారి ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 టీడీపీది అదే పరిస్థితి..
 కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీది అదే పరిస్థితి. ఇప్పటి వరకు బీజేపీ తమకు మద్దతు ఇస్తుందని ఆశపడిన తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ కీలక నేతలు జేఏసీలో ఉండడం, వారంతా సీపీఐకి మద్దతు ఇస్తూ బరిలోకి దిగడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన టీడీపీ మూడు వార్డులను కైవసం చేసుకుంది. అనంతరం 2005లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం మద్దతుతో బరిలోకి దిగి 6 వార్డుల్లో పాగా వేసింది. అయితే మున్సిపాలిటీలో టీడీపీకి బలం అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ సారి టీడీపీతో కలిస్తే తమకు లాభం చేకూరదనే భావనతో మిగిలిన పార్టీలు  భావిస్తున్నట్లు తెలిసింది.

 దీంతో 33వ వార్డులో కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల కోసం టీడీపీ నాయకులు గల్లీల్లో వెతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామవరంలోని మూడు వార్డులో అభ్యర్థులు దొరక్క అక్కడ ఉన్న వ్యాపారులను తమ పార్టీ నుంచి పోటీ చేయాలని బతిమిలాడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ పంచర్ కావడం తథ్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
 

మరిన్ని వార్తలు