అందరిచూపు హుజూర్‌నగర్‌ వైపు..

6 Jun, 2019 09:05 IST|Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఆర్నేళ్లలోపు హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉత్తమ్‌ తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి చారికి అందజేశారు. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఈ స్థానాన్ని ఖాళీగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు వెళ్లనుంది. ఉప ఎన్నికల జరగనుండడంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

అసెంబ్లీకి ఐదు పర్యాయాలు విజయం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో, హుజూర్‌నగర్‌ నుంచి 2009, 2014, 2018లో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక చట్టసభకు ఎన్నికై ఇదే సమయంలో మరో చట్టసభకు పోటీ చేసి ఎన్నికైన వారు.. ఏదైనా ఒక ప దవికి 14 రోజుల్లో రాజీనామా చేయాలి. దీని ప్రకారం గత నెల 23న ఎంపీగా విజయం సాధించిన ఉత్తమ్‌ సరిగ్గా 13వ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజుర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, ఎంపీగా కూడా గెలిపించి వారి అభిమానాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. ఎంపీగా ఈరెండు నియోజవర్గాలతో పాటు మరో ఐదు నియోజకవర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందని, ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

అందరిచూపు హుజూర్‌నగర్‌ వైపు..
ఉత్తమ్‌ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రస్థాయిలో ప్రధాన పార్టీలచూపు ఈ నియోజకవర్గంపై పడింది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారని చర్చసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు ఇక్కడ 12 వేల పైచిలుకు మెజార్టీ వచ్చింది. దీంతో ఈ స్థానంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తమ ఖాతాలో వేసుకోవచ్చని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఈ స్థానంపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. హుజూర్‌నగర్‌పై సీఎం మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో చర్చించడం, ప్రచార బాధ్యతలు అప్పుడే మంత్రి కేటీఆర్‌కు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ స్థానంలో విజయం సాధిస్తామని సీఎం జిల్లా ప్రజాప్రతినిధులకు చెప్పడంతో విజయం కోసం ఇక టీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈస్థానంపై దృష్టి పెట్టడంతో ఉత్తమ్‌ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆపార్టీ ముఖ్య నేతలకు ఉత్తమ్‌ ఇక్కడ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌ ఈ రెండు నియోజవర్గాల నేతలు ఉప ఎన్నికలో ఎవరి బలాబలాలు ఎలా ఉంటోయోనని చర్చించుకుంటున్నారు. 

  అభ్యర్థులెవరో..?
ఈ స్థానంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారని రాజకీయంగా ఆసక్తికర చర్చసాగుతోంది. ఇటీవల అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్‌ సమక్షంలో శానంపూడి సైదిరెడ్డితో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు చర్చకు వచ్చా యి. గుత్తాకు గతంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారంతో చివరకు శానంపూడినే ఇక్కడినుంచి బరిలోకి దింపుతారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై.. శానంపూడి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసా రి అతనిపై సానుభూతి కూడా ఉంటుం దని తమదే విజయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆ ర్‌ఎస్‌ నుంచి ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన ముఖ్య నేతలను కూడా ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది.

ఇక హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతినే బరిలోకి దింపాలని ఆపార్టీ యోచిస్తోంది. కోదాడలో ఆమె 756 ఓట్ల తేడాతో ఓటమిపాలు కావడంతో హుజుర్‌నగర్‌లో పార్టీ, ఉత్తమ్‌ చరిష్మాతో సునాయాసంగా గట్టెక్కుతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీనే తమ గెలుపునకు నాంది కాబో తుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గ నేతలు కూడా ఆమెనే బరిలోకి దింపాలని ఉత్తమ్‌కు చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ విజయం సాధిస్తే తమకు తిరుగులేదని టీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. ఉత్తమ్‌ ఇలాఖాలో విజ యం తమకు సునాయాసం అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ధీమాతో ఉంది.

మరిన్ని వార్తలు