‘ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలి’

20 Nov, 2019 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో బుధవారం అఖిలపక్షం నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిశారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు, ప్రభుత్వ అఫిడవిట్‌, సునీల్‌ శర్మ అఫిడవిట్‌, ఐఏఎస్‌ అధికారుల కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కాపీలను గవర్నర్‌కి సమర్పించారు. అనంతరం బీజేపీ నాయకుడు మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. విలీనంపై కార్మికులు వెనక్కితగ్గినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తటస్థంగా ఉండాల్సిన ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని వివరించారు.

సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కనికరం లేదని విమర్శించారు. గవర్నర్‌ అయినా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు కానీ, కేసీఆర్‌ మాత్రం ఇవ్వరని ఎద్దేవా చేశారు.ప్రయాణీకుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌ని కోరామని పేర్కొన్నారు. మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌తో మొరపెట్టుకున్నామని తెలిపారు. సమ్మెను చట్ట వ్యతిరేకంగా చూడకుండా కార్మికులు ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా