సర్కార్‌ దిగిరాకపోతే సకల జనుల సమ్మె: అఖిలపక్షం

10 Oct, 2019 01:56 IST|Sakshi

ఇప్పటికైనా చర్చలు జరిపి, ఆర్టీసీ విలీన చర్యలు చేపట్టాలి

ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల అఖిల పక్షం డిమాండ్‌

19న రాష్ట్ర బంద్‌కు యోచన.. నేటి భేటీలో తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాల తో చర్చలు జరిపి ప్రభుత్వం విలీన చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ (రెండు గ్రూపులు), టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన, శివసేన, ఎమ్మార్పీఎస్, బీసీ సంక్షే మ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ మీడియా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, వివిధ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే భవిష్యత్‌ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించాయి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌ నిర్వ హించాలని నిర్ణయించినా, గురువారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.  సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారు.

అందరూ పాల్గొనాలి: కోదండరాం 
ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెగా ఉన్నది కాస్తా సకల జనుల సమ్మెగా మారాల్సి ఉందని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు.

సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ 
సమ్మె కొనసాగించి తీరుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. కాడిని మధ్యలో దించే ప్రసక్తేలేదని, తమ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదని చెప్పారు. ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తీసేసే హక్కు సీఎంకు లేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనిపై పోరాటానికి న్యాయ పరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచంద్రరావు తెలిపారు. కేసీఆర్‌ బెదిరింపులకు భయ పడేది లేదని, ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి పోరాటానికి అయినా మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ చెప్పారు.

ముందే మద్దతిచ్చాం: చాడ 
సెల్ప్‌ డిస్మిస్‌ అనేది అత్యంత ఘోరమైన పదమని, ఇట్లా పిచ్చోడు కూడా మాట్లాడడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సమ్మె మొదలుకాక ముందే టీఆర్‌ఎస్‌కు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతునిచ్చిందని, ఆర్టీసీ ప్రైవేటీకరణను సహించేది లేదని స్పష్టం చేశారు.  

ఆర్టీసీ కోసం పోరాడాలి.. 
ఆర్టీసీ నిర్వీర్యం చేసి ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌ అహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు పోరాటం కొనసాగించాలని చెప్పారు. ఆర్టీసీ ఓడితే, తెలంగాణ ఓడిపోయినట్టేనని అందువల్ల అన్ని వర్గాలు కలసి ఈ సంస్థ పరిరక్షణకు పోరాడాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పిలుపునిచ్చారు. సీఎం ప్రతిష్టకు పోకుండా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 48 వేల మందిని ఒక్క కలం పోటుతో డిస్మిస్‌ చేస్తామంటే, చరిత్రలో నియంతలకు పట్టిన గతే సీఎంకు పడుతుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ భేటీలో విమలక్క (టీయూఎఫ్‌), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), జిట్టా బాలకృష్ణారెడ్డి (యువ తెలంగాణ పార్టీ), రాజిరెడ్డి, థామస్‌రెడ్డి (ఆర్టీసీ జేఏసీ), చిక్కుడు ప్రభాకర్‌ (తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక), సాధినేని వెంకటేశ్వరరావు, పోటురంగారావు (న్యూడెమోక్రసీ రెండు వర్గాలు), భుజంగరావు, సదానందం, విజయ్‌మోహన్, దత్తాత్రేయ (ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు)ఇతర సంఘాల వారు పాల్గొన్నారు. 

సమ్మెపై ఉత్కంఠ: నేడు విచారించనున్న హైకోర్టు  
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ కొనసాగించనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌.సుబేందర్‌సింగ్‌ దాఖ లు చేసిన పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించనుంది. వ్యాజ్యం దాఖలు వెనుక ప్రజాహితమే లేదని, కార్మిక సంఘాల ప్రయోజనం దాగి ఉందని చెప్పి ప్రభు త్వం తన వైఖరిని వెల్లడించిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చట్ట విరుద్ధమని, వెంటనే సమ్మె విరమించేలా హైకో ర్టు 2015లో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మాదిరిగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని పిటిషనర్‌ కోరుతున్నారు. గురువారం నాటి విచారణలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది. 

మరిన్ని వార్తలు