సమగ్ర సర్వేలోసకల జనులు

20 Aug, 2014 03:02 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉదయం పది గంటల వరకు సర్వే 22 శా తంగా నమోదైంది. అప్పటి వరకు మందకొడి గా సాగిన సర్వే ఆ తర్వాత వేగం పుంజుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు 5,63,275 కుటుంబాలు (81శాతం) తమ వివరాలను నమోదు చేయించుకున్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ అదనంగా మరో 600 మంది ఎన్యూమరేటర్లను ప్రత్యేకంగా రంగంలోకి దింపడంతో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యానికి చేరుకుంది. అయితే, జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తమ పేర్లు లేవని, తమ ఇంటికి స్టిక్కర్లు వేయలేదని, స్టిక్కర్లు వేసినా ఎన్యూమరేటర్లు వివరా లు నమోదు చేయలేదని ప్రజలు ఆందోళనకు దిగారు.

 ఎలుపుగొండ ఎంపీడీఓ రవీశ్వర్‌గౌడ్, కామారెడ్డి మున్సిపల్ క మిషనర్ బాలోజీ నాయక్ తదితరులను నిర్బంధించారు. ఎడపల్లిలో నిర్బంధించిన ఎన్యూమరేటర్లను ఉన్నతాధికారులు విడిపించారు. చెదురు మదురు సంఘటనలు మినహా సర్వే ప్రశాంతంగా ముగిసింది. సర్వే సందర్భంగా జిల్లా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూరు, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ తదితర పట్టణాలలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి ఉంచారు. వాహనాలు తిరగలేదు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి.

 ఇళ్ల వద్దనే ఉండి
 వ్యవసాయ శాఖ మంత్రి పరిగి శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్వగ్రామం బాన్సువాడ నియోజకవర్గం పోచారంలో పేరు నమోదు చేయించుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూరు మండలం సిర్పూరులో వివరాలు నమోదు చేసుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ పాంగ్రా పరిధిలోని బ్యాంకు కాలనీలో వివరాలు నమోదు చేసుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే అహ్మద్ షకీల్, ఆయన కుటుంబసభ్యులు 35 వార్డులో నమోదు చేసుకున్నారు. నవీపేట మండలం సిరాన్‌పల్లికి చెందిన మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి ఇంటికి తాళం ఉంది.

ఆయన హైదరాబాద్‌లో సర్వేలో పాల్గొన్నారని సమాచారం. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డోన్‌గాంలో, జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు మహమ్మద్‌నగ ర్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

 సర్వే జాబితాలో పేర్లు లేవని నిరసనలు
 జిల్లా అంతటా సర్వే సందడి...పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. దూరం ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు స్వగ్రామాలకు చేరుకుని సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమ ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదని, సర్వే జాబితాలో తమ పేర్లు లేవని నిరసన వ్యక్తం చేశారు. రెంజల్ మండలం నీలా, ఈరన్నగుట్ట తదితర గ్రామాలలో ప్రజలు గ్రామ పంచాయతీలను ముట్టడించారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి నమోదు చేస్తామని హామీ ఇవ్వడం  తో ఆందోళన విరమించారు. మాచారెడ్డి మండలం ఎలుపుగొండలో ఎంపీడీఓ రవీశ్వర్‌గౌడ్‌తోపాటు ఐ  దుగురు సాక్షరభారత్ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో వారు గ్రామ పంచాయతీలోకి వెళ్లి త లుపులు వేసుకున్నారు.

 నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్‌లో, పరారీ లో ఉన్న  అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ ధనుల వెంకట్రాములు సర్వే కోసం వచ్చి పోలీసులకు చిక్కాడు. కుటుంబాల సంఖ్య కొత్తగా చేరిన వారితో 7.10 లక్షలకు పెరిగిందని, కొద్దిగా ఆలస్యం జరిగినా నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశామని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ మంగళవారం రాత్రి పేర్కొన్నారు. కాగా, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు బుధవారం సెలవు ప్రకటించారు.

మరిన్ని వార్తలు