‘పథకం’ ప్రకారం కసరత్తు

16 Feb, 2016 04:13 IST|Sakshi

అభయహస్తం ఉంచాలా.. వద్దా?
డ్వామా, డీఆర్‌డీఏలను  ఒక్కటి చేద్దామా..
పావలా వడ్డీ.. రుణ పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు
బడ్జెట్ తయారీపై ముగిసిన ప్రణాళికా విభాగం కసరత్తు

 సాక్షి, హైదరాబాద్: ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల్లో కొన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ప్రణాళిక సంఘం కసరత్తు చేస్తోంది. కొన్నింటిని రద్దు చేయాలని భావిస్తోంది. అభయహస్తం ఉంచాలా.. వద్దా.. అని ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని ఆసరాలో విలీనం చేసే విషయంపైనా యోచిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)ను ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చే వీలుందా అని పరిశీలిస్తోంది.

పొలంబడి పథకం రద్దు చేయాలని, తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు పట్టు పరిశ్రమలకు అనుకూలించనందున ఆ పథకాలన్నీ తొలగించాలని, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ పథకాలన్నీ ఒకే పథకం కిందికి తీసుకురావాలని, విత్తనోత్పత్తి పథకం, సీడ్ ఫామ్స్ పథకం, సబ్సిడీపై విత్తన సరఫరా పథకం, సబ్సిడీ సీడ్ ప్రొడక్ట్స్ పథకాలన్నీ ఒక్కటిగానే పరిగణించాలని, ఈ తరహాలో వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న పథకాల్లో  సగం పద్దులు తొలగించాలని భావిస్తోంది. ఇదే తీరుగా శాఖల వారీగా జరిగిన బడ్జెట్ తయారీ సమీక్షలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను సిద్ధం చేస్తోంది.

 260 పద్దుల విలీనం: ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ పథకాలకు సంబంధించి 839 పద్దులున్నాయి. వీటిలో 260 పథకాలను మిగతావాటిలో విలీనం చేసేందుకు వీలుందని ఆర్థిక శాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ జాబితాలను అన్ని శాఖలకు పంపించింది. వీటి ఆధారంగానే రాష్ట్ర ప్రణాళిక సంఘం వివిధ శాఖలతో 4 రోజులపాటు సమీక్ష నిర్వహించింది. గతానికి భిన్నంగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి పథకాల విలీన ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో  ఈ సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను తయారు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను సీఎస్ రాజీవ్‌శర్మకు సమర్పించి.. తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిస్తారు. వాయిదా పడ్డ జిల్లా అభివృద్ధి కార్డుల తయారీ ప్రక్రియ బడ్జెట్ తర్వాతే  చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
 

మరిన్ని వార్తలు