బోనం.. పర్యావరణహితం

12 Jul, 2018 10:33 IST|Sakshi
కోటలో పెయింటింగ్‌ వేస్తున్న కళాకారుడు

గోల్కొండ బోనాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి  

ప్లాస్టిక్‌ రహిత వస్తువుల వినియోగం  

పేపర్, మట్టి గ్లాస్‌లతో మంచినీటి సరఫరా  

చెత్త తొలగింపునకు ప్రత్యేక కార్యాచరణ  

మెట్లను పునరుద్ధరించిన పురావస్తు శాఖ  

బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ జగదాంబిక బోనాలను ఈసారి పర్యావరణహితంగా నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల  15న ప్రారంభం కానున్న ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈసారి ఉత్సవాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు సైతం ప్లాస్టిక్‌ బ్యాగులు, ఇతర వస్తువులను వినియోగించకుండా అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసే సదుపాయాల్లోనూ ప్లాస్టిక్‌వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు మంచి నీటి సరఫరాకు పేపర్, మట్టి గ్లాసులను వినియోగించనున్నారు.

వాటర్‌ ప్యాకెట్లు అందజేయాల్సి వస్తే.. బాగా దళసరిగా ఉండే  ప్యాకెట్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. గోల్కొండ కోటకు వెళ్లే రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసే మంచినీటి కేంద్రాల్లో వీలైనంత వరకు మట్టి గ్లాసులను వినియోగించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.తొలి రోజు దాదాపు 1.5 లక్షల మంది భక్తులు తరలి రానున్నట్లు అంచనా. అలాగే  22న భక్తుల రద్దీ భారీగా పెరుగనుంది. ఆ రోజు 3లక్షల మందికి పైగా భక్తు లు తరలివచ్చే అవకాశం  ఉంది. ఆ తర్వాత భక్తు ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. ఇం దుకనుగుణంంగా మంచినీటి సరఫరా, ఇతర ఏర్పాట్లను వివిధ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు  ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 

మెట్ల పునరుద్ధరణ...
చారిత్రక జగదాంబిక ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లను పురావస్తుశాఖ అధికారులు పునరుద్ధరించారు. ఈ మార్గంలో సుమారు 300లకు పైగా మెట్లు ఉన్నాయి. ఊడిపోయిన కొన్ని మెట్లను వాటి సహజత్వానికి అనుగుణంగా పునరుద్ధరించి, భక్తులు వెళ్లేందుకు వీలుగా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలను సైతం పునరుద్ధరించారు. అలాగే ఇప్పటి వరకు అక్కన్న మాదన్నల రికార్డు రూమ్‌ల వద్ద భక్తులు విడిది చేస్తున్నారు. దీంతో రికార్డు రూమ్‌ సహజత్వం దెబ్బతింటోందని పురావస్తు శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది బోనాలను అలంకరించుకునేందుకు, వంటలు చేసుకునేందుకు రికార్డు రూమ్‌కు దూరంగా మొదటి బావి వద్ద అనుమతినిచ్చినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. రికార్డు రూమ్‌తో పాటు, కోట సహజత్వానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటునట్లు పురావస్తుశాఖ గోల్కొండ ఇన్‌చార్జి భానుప్రకాశ్‌ వర్మ ‘సాక్షి’తో చెప్పారు. మొదటి బావి వద్ద స్థలం ఎంతో విశాలంగా ఉంటుందని అక్కడ భక్తులు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. 

ఆలయ మార్గంలో అలంకరణ...
ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా జరిగే బోనాల వేడుకలు గోల్కొండతో మొదలవుతాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మార్గాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తున్నారు.  అలాగే భక్తుల రాకపోకలకు వీలుగా, రద్దీ నియంత్రణకు అనుకూలంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆలయ మార్గంలో 60 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1,800 మందికి పైగా పోలీస్‌ సిబ్బందితో భద్రత చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు