అంతా రెడీ!

22 May, 2019 10:48 IST|Sakshi

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ జిల్లాలో 14 కేంద్రాల్లో లెక్కింపు  

జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో:  సిటీలో గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. కౌంటింగ్‌ సిబ్బందికి అవసరమైన శిక్షణతోపాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ మాణిక్‌రాజ్, సికింద్రాబాద్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి, నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌లతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో  కౌంటింగ్‌ ఏర్పాట్లను వివరించారు. జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు 14 కేంద్రాల్లో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్‌ అధికారులకు ఇప్పటికే ఒక దఫా శిక్షణనిచ్చామని బుధవారం ముఫకంజా ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో  అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా మరింత క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డీఈఓలు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు కూడా సీఈఓ ఆధ్వర్యంలో శిక్షణ జరిగిందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు మూడు వలయాల్లో పటిష్ట పోలీసు బలగాల భద్రత ఉంటుందన్నారు.

కౌంటింగ్‌ పరిశీలకులతోపాటు జనరల్‌ అబ్జర్వర్‌లు కూడా ఉంటారన్నారు. 23వ తేదీన ఉదయం 6.30 గంటలకు రాజకీయ ప్రతినిధులు, పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎలను కౌంటింగ్‌ కేంద్రాలకు తెస్తామని, కౌంటింగ్‌ సిబ్బంది 6 గంటలకల్లా విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించామన్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓట్లను ఎవరు లెక్కించాలనేదానికి బుధవారం తనతోపాటు ఆర్‌ఓ, అబ్జర్వర్‌ సమక్షంలో..ఆ తర్వాత గురువారం అసెంబ్లీ సెగ్మెంట్‌ కౌంటింగ్‌ సెంటర్‌వద్ద ఏ టేబుల్‌ వద్ద ఎవరుండాలనేదానికి గురువారం ఉదయం మరోమారు ర్యాండమైజేషన్‌ జరుగుతుందన్నారు. ఒక్కో వరుసలో 7 టేబుళ్ల వంతున రెండు వరుసల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కూడా శిక్షణ పూర్తయిందన్నారు. మోడల్‌ కౌంటింగ్‌ కూడా నిర్వహించామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు, మీడియా ప్రతినిధులకు కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లే పాస్‌లిస్తామని, అయితే ఎవరినీ కూడా సెల్‌ఫోన్లతో ఓట్ల లెక్కింపు ప్రదేశానికి అనుమతించకుండా నిషేధం ఉందన్నారు. స్టాండ్లు, ట్రైపాడ్లు లేకుండా టీవీ కెమెరాలను అనుమతిస్తామన్నారు. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేందుకు, కౌంటింగ్‌ కేంద్రం బయట తగిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వేసవి దృష్ట్యా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద  కూలర్లు, తాగునీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. 

ఈ–సువిధ ద్వారా..
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏ రౌండ్‌కు ఆ రౌండ్‌ ఓట్ల వివరాలు ఈ–సువి«ధలో నమోదయ్యాక ఏఆర్‌ఓ ప్రకటిస్తారని, అక్కడి నుంచి మీడియాకు తెలియజేస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుండగా 7 గంటలలోపుగా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించామన్నారు. తొలుత పోస్టల్, సర్వీస్‌ ఓట్లు లెక్కిస్తారని, పోస్టల్‌ ఓట్లను ఆర్‌ఓలే లెక్కిస్తారని పేర్కొన్నారు. వెబ్‌ కెమెరాలు లేకపోయినప్పటికీ, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా కౌంటింగ్‌ కేంద్రాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. వీవీప్యాట్లలోని ఓట్లకు, ఈవీఎంలలోకి ఓట్లకు తేడా వస్తే..వీవీప్యాట్లలోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లెక్కింపు సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తితే సదరు ఈవీఎంలను పక్కనపెట్టి మిగతావి లెక్కిస్తామని, విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేసి అక్కడి నుంచి అందే సూచనల మేరకు ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సమయం..
ఫలితాల వెల్లడికి అసెంబ్లీ ఎన్నికల కంటే కొంత ఎక్కువ సమయం పడుతుందని దానకిశోర్‌ పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ర్యాండమ్‌గా ఐదు వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు దాదాపు 20 నుంచి 30 నిమిషాల సమయంపట్టే అవకాశం ఉందన్నారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు పూర్తయ్యాక పార్లమెంట్‌ నియోజకవర్గ ఫలితాన్ని సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ సిబ్బందికాక, ఇతరత్రా సిబ్బందితో వెరసి దాదాపు 1500 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటారన్నారు.  

పకడ్బందీగా ఏర్పాట్లు..
ఎన్నికల సంఘం మార్గదర్శకాల  కనుగుణంగా తగిన పోలీసు బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినటుల నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సీనియర్‌ ఆఫీసర్లతోపాటు తగినంత సిబ్బందిని నియమించామన్నారు.దాదాపు 5200 మంది విధుల్లో ఉంటారన్నారు.  కౌంటింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల వరకు  24వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్‌  అమల్లో ఉంటుందని,  అప్పటి వరకు విజయోత్సవ   ర్యాలీలు, ప్రదర్శనలపై  నిషేధం ఉంటుందన్నారు.

ఓట్ల లెక్కింపులోపాల్గొనేవారు..
కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు : 251 మంది
కౌంటింగ్‌ అసిస్టెంట్లు : 251 మంది
కౌంటింగ్‌ అబ్జర్వర్లు : 261 మంది

జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో..
సర్వీసు ఓటర్లు : 382

పోస్టల్‌బ్యాలెట్లు తీసుకున్నవారు..
సికింద్రాబాద్‌ పార్లమెంట్‌: 3900
హైదరాబాద్‌ పార్లమెంట్‌: 2696  
ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 

మరిన్ని వార్తలు