చల్లంగ చూడు స్వామి

8 Jun, 2020 03:10 IST|Sakshi
సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభం కానుండటంతో యాదాద్రిలో భౌతిక దూరం కోసం మార్కింగ్‌ చేస్తున్న దృశ్యం.. 

నేటి నుంచి ఆలయాల్లో భక్తులకు అనుమతి..

భక్తులు నిబంధనలు పాటించాలి: ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల 78 రోజుల పాటు దేవాలయాల్లో భక్తుల దర్శనంపై నిషేధం విధిం చారు. అర్చకులు పూజాధికాలు నిర్వహిస్తున్నా భక్తులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఆలయాలు సోమవారం నుంచి భక్తుల రాక ప్రారంభమయ్యి.. పూర్వపు శోభ సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి కోవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ భక్తులను అనుమతించనున్నారు. భక్తులు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తరలిరావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఆలయాల్లో తీర్ధ ప్రసాదాలు, శఠగోపం, గంట వాయించటం, కోనేటి స్నానాలు, తలనీలాలు సమర్పించడం లాంటి వాటిని నిషేధించింది.

భక్తులకు ఎలాంటి భయం అవసరం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయాలకు ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు రాకుండా కొంత కట్టడి ఉంటుందని, వచ్చే వారిని శరీర ఉష్ణోగ్రత చెక్‌ చేసి ఆరోగ్యంగా ఉంటేనే లోనికి అనుమతిస్తామని వెల్లడించారు. ఆలయాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచామని, భక్తులు కూడా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలన్నారు. కాగా, ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనా జనం వాటిని ఆశ్రయించేందుకు జంకుతున్న నేపథ్యంలో దేవాలయాలు తెరుచుకున్నా భక్తుల సందడి పలచగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్జిత సేవలు జరిపించుకునేలా దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకుని కోరుకున్న రోజుల్లో కోరుకున్న పూజాధికాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. 


హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో విగ్రహాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్న దృశ్యం

లాక్‌డౌన్‌తో కోల్పోయిన ఆదాయం రూ.200 కోట్లు
లాక్‌డౌన్‌ సమయంలో దేవాలయాల్లోకి భక్తుల రాకను నిషేధించటంతో దేవాదాయ శాఖ దాదాపు రూ.200 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఆర్జిత సేవలు, హుండీలు, ప్రసాద విక్రయంతోపాటు ఇతరత్రా ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు దేవాలయాలనే నమ్ముకుని వాటి ముందు వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. కొబ్బరికాయలు, పూలు, ఇతర పూజా ద్రవ్యాలు అమ్మేవారికి రెండున్నర నెలలుగా ఆదాయం లేకుండా పోయింది. 

యాదాద్రీశుడి దర్శనానికి సర్వం సిద్ధం..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు ప్రయోగాత్మకంగా ఆలయ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానిక భక్తులకు అధికారులు దర్శనాన్ని కల్పించనున్నారు. 9వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామివారి ఉచిత, లఘు దర్శనాలను కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఆధార్‌ కార్డు తీసుకురావాలని సూచిస్తున్నారు. భౌతికదూరం పాటించేలా క్యూలైన్లు, ఆలయ వీధులు, ప్రసాద కౌంటర్ల వద్ద, బాలాలయంలో సర్కిల్స్‌ గీశారు. ఫోర్‌ వీలర్లపై వచ్చే భక్తుల వాహనాలను అనుమతివ్వడం లేదని, కొండపైకి ఆర్టీసీ బస్సులు, కొన్ని ఆటోలను మాత్రమే అనుమతిచ్చినట్లు ఈఓ గీతారెడ్డి వివరించారు. కల్యాణకట్టను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. స్వామిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. క్యూలైన్లలో ప్రతి భక్తుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తామని, ఎవరికైనా లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తరలిస్తామని పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు