మండే అక్షరం..

8 Feb, 2015 04:26 IST|Sakshi
మండే అక్షరం..

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం అంతరంగం
 అక్షరాన్ని నమ్ముకున్న ఆ వ్యక్తి... దానినే ప్రేమించాడు. దానితో పాటే నడిచాడు. అక్షరమనే మొక్కల గాలి పీల్చాడు. ‘ఇంతింతై’ అన్నట్టు... ఆ చెట్టు నీడలోనే ఎదిగాడు. అక్షరాలను
 ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ముందు వరుసలో నిలిచాడు. కలం వీరులు తోడు రాగా...‘కథ’ం తొక్కాడు. పోరాట పటిమ... అనుభవం అంద రిలో ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అవే ‘ప్రెస్ అకాడమీ చైర్మన్’ పదవి వరించడంలోనూ...‘అల్లం’త ఎత్తున ఆయనను కూర్చోబెట్టడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఆ కలం యోధుడే అల్లం నారాయణ. ఈ అక్షర సేనానితో ‘సాక్షి...మార్నింగ్ వాక్’.
 
 పేరు : అల్లం నారాయణ
 పుట్టిన తేదీ : 13 డిసెంబర్ 1959
 తల్లిదండ్రులు : నర్సయ్య, బుచ్చమ్మ
 భార్య :  పద్మ
 పిల్లలు : రవళి, భావన, రాహుల్
 స్వస్థలం : గాజుల పల్లె, మంథని మండలం, కరీంనగర్
 జీవితంలో గొప్ప సంతృప్తి: తెలంగాణ రాష్ర్ట ఆవిర్బావం
 బాగా ఇష్టమైన అంశం: పాత్రికేయుడిగా సుదీర్ఘపయనం.
 అభిరుచి : నిరంతరం పుస్తకాలు చదవడం
 నచ్చిన లెజెండ్స్ :  చైనా విప్లవోద్యమ నిర్మాత మావో, గద్దర్, గోరటి వెంకన్నల పాటలు, శివసాగర్ కవిత్వం.
 నచ్చిన సినిమాలు : రష్యన్ దర్శకుడు తార్కోవిస్కీ తాత్విక సినిమాలు
 నచ్చిన వంటలు  :  మొక్కజొన్న పేలాలు, బెండకాయ కూర, సర్వపిండి
 
 సాక్షి, సిటీబ్యూరో: సుమారు ఐదు దశాబ్దాలు పైబడిన ప్రవాహ గానం. మట్టిని... మనిషిని... మానవ సంబంధాన్ని పట్టి నిలిపిన అక్షర అనుబంధం. కథ, నవల, పాట, పత్రికా రచనలను ప్రాణప్రదంగా భావించే పయనం అల్లం సోదరుల సొంతం. వీరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెక్కాడితేగానీ డొక్కాడని అల్లం నర్సయ్య, బుచ్చమ్మల ముగ్గురు కుమారులు వారు. సాహిత్యంలో నిప్పుల ఉప్పెనలు కురిపించిన అన్న అల్లం రాజయ్య... ఆ బాటనే నడిచిన అల్లం వీరయ్య, అల్లం నారాయణ లు. విప్లవకారుడిగా.. కవిగా... రచయితగా... సంపాదకుడిగా... తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితులైన అల్లం నారాయణ... తెలంగాణ రాష్ర్ట ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో తన అనుభవాలు.. భవిష్యత్తు ప్రణాళికలు ‘అల్లం’  మాటల్లోనే...
 
 ఉద్యమ జీవితం
 ఎమర్జెన్సీ చీకటి రోజులు. పారా మిలిటరీ పద ఘట్టనల కింద అన్ని తెలంగాణ పల్లెల్లాగే మా గాజుల పల్లె కూడా నలిగిపోతున్న సందర్భమది. కరీంనగర్ జిల్లా మంథనికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా పల్లె. అమ్మా, నాయనలకువ్యవ సాయమే ఆధార ం. ఇక చదువంటే అన్న రాజయ్యతోనే మొదలైంది. ఆయన బాటలోనే రెండో అన్న వీరయ్య, నేను నడిచినం. మా ముగ్గురి తోబుట్టువు సోదరి లక్ష్మి. మూడో తరగతి వరకే ఊళ్లో చదువుకున్న. ఆ తరువాత వెన్నంపల్లిలో ఐదు వరకు చదివిన. మంథనిలో పదో తరగతి పాసై ఇంటర్‌లో చేరే నాటికి చీకటి రోజులు వచ్చిపడ్డాయి.
 
 1975లో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. విప్లవోద్యమం వైపు వెళ్లాను. అప్పటి పరిస్థితులు అలాంటివి. కొంతకాలం పనిచేసిన తరువాత గంభీరావు పేటలో ఒక సంఘటనలో అరెస్టయ్యాను. 2 నెలల పాటు నిర్బంధం. ఆ తరువాత మరోసారి అరెస్టయి... ఎమర్జెన్సీ ఎత్తి వేయడంతో బయటకు వచ్చిన. తిరిగి అజ్ఞాతంలోకే వెళ్లిపోయిన. 1982లో బయటకు వచ్చిన తరువాత ఉస్మానియాలో ఎమ్మేలో చేరిన. 1984లో చదువు పూర్తయింది. ఉస్మానియాలో చదువుకొనే రోజుల్లోనే పద్మ, నేను స్టేజీ మ్యారేజ్ చేసుకున్నాం. కరీంనగర్ టౌన్‌లో ఆ రోజుల్లో మా పెళ్లి చర్చనీయాంశం. పైగా నా పెళ్లిలో నేనే వక్తను కావడం విశేషం.
 
 పత్రికా రంగంలోకి...
 ఉపాధి కోసం కొంత కాలం వ్యవసాయం చేసిన. కానీ గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో కరీంనగర్ కేంద్రంగా విజయ్ కుమార్ సంపాదకత్వంలో వెలువడిన ‘జీవగడ్డ’ పత్రిక నాతో పాటు, మరికొంత మంది మిత్రులకు ఒక చక్కటి అవకాశం.  నేను, చారి, ఘంటా చక్రపాణి అట్లా పరిచయమైన వాళ్లమే. ‘జీవగడ్డ’లో పని చేసే రోజుల్లోనే ‘వెన్నెల కోనల్లో’ శీర్షికతో కథనాలు రాసిన. ఆ తరువాత 1986లో బెంగళూరు, విజయవాడల్లో కొంతకాలం పత్రికా రంగంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించా. 1989 నుంచి విధి నిర్వహణ హైదరాబాద్‌కు మారింది. ఇదంతా ఒకవైపు అయితే... ఉద్విగ్నభరితమైన తెలంగాణ ఉద్యమం మరోవైపు. ఈ ఉద్యమంలో  ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్’ (టీజేఎఫ్) చారిత్రక బాధ్యతను నిర్వర్తించింది. రాజకీయ వర్గాల్లో స్తబ్దత నెలకొన్నప్పుడు... కేంద్రం వైఖరిలో మార్పులు కనిపించినప్పుడు... నిరాశా నిస్పృహలతో విద్యార్థులు, యువత బలిదానాలకు పాల్పడుతున్నప్పుడు... ఆ వర్గాలను ముందుకు నడిపించడంలో టీజేఎఫ్ క్రియాశీల కర్తవ్యం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గొప్ప సంతృప్తి అయితే... ఆ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర అంతే ఉత్తేజకరమైన అనుభవం.
 
 ప్రెస్ అకాడమీ లక్ష్యాలు
  సుదీర్ఘ కాలం సాగిన  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. కొంతమంది బలిదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరితో పాటు తమ బతుకులు బాగుపడతాయని విలేకరులూ ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు.. జిల్లా కేంద్రాలు... రాష్ట్ర రాజధానిలో వివిధ బాధ్యతల్లో పని చేసే వారికి ఎన్నో ఆశలు...ఆకాంక్షలు ఉన్నాయి. ఏ ఒక్కరి  ఆశలను వమ్ము చేయబోం. ముఖ్యంగా హెల్త్‌కార్డులకు అప్పటి ఉమ్మడి ప్రభుత్వంలో కొంత కృషి జరిగింది.
 
 జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌కార్డులు అందజేయాలనే ప్రతిపాదన ఉంది. సబ్‌ఎడిటర్‌లకూ అక్రిడిటేషన్లు అందించాలి.ప్రభుత్వం నుంచి లభించే  ఈ గుర్తింపు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా  దక్కవలసిందే. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అ న్ని అంశాలపైనా ప్రత్యేక కార్యాచరణతో అకాడమీ ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి వివిధ పనుల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల అకాడమీ సమావేశం జరుగలేదు. త్వరలో సీఎంతో సమావేశమవుతాం. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి బాటలు పడతాయి.  
 
 ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా...
  తెలంగాణ ఆవిర్భావం వరకు వచ్చిన మొత్తం ప్రింట్, ఎలక్ట్రానిక్  మీడియా కథనాలన్నింటినీ ఒక రిసోర్స్‌గా భద్రపర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు, సాంస్కృతిక అణచివేతకు గురైన తెలంగాణ భాష, యాస, మాండలికాలకు కొత్త రాష్ట్రంలో ప్రాచుర్యం లభించవలసి ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ పదకోశాన్ని రూపొందిస్తాం. భాషపై విస్తృతంగా సదస్సులు, వర్క్‌షాపులు ఏర్పాటు చే స్తాం. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ స్థాయిల్లో పని చేసే వారికి అవగాహన, నైపుణ్యం పెరిగేలా అత్యుత్తమ శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మొత్తంగా ప్రెస్ అకాడమీని ఒక ‘ఆర్ట్ ఆఫ్ అకాడమీ’గా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వంఉంది.
 

మరిన్ని వార్తలు