తప్పుడు పత్రాలతో హస్తగతం!

26 Feb, 2020 01:41 IST|Sakshi

రేవంత్, ఆయన సోదరుడి పేరుతో 6 ఎకరాల భూమి మ్యుటేషన్‌

ప్రభుత్వ విచారణలో బట్టబయలు..

అసలు హక్కుదారులు ఎవరో స్పష్టత లేదు

సీఎస్‌కు నివేదిక పంపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌

సహకరించిన అప్పటి డిప్యూటీ కలెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడితో కలసి తప్పుడు పత్రాలతో అత్యంత ఖరీదైన భూమిని తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ విచారణలో బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల పట్టా భూమి ఉండగా, అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్‌రెడ్డి అక్రమ మార్గంలో హస్తగతం చేసుకున్నారని నివేదిక వెల్లడించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, రేవంత్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రేవంత్‌ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశిచింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు సీఎస్‌కు నివేదిక సమర్పించారు. తప్పుడు పత్రాలతో తొలుత వేరే వారి పేరు మీద భూమి రాయించి, ఆ తర్వాత వారి నుంచి కొనుగోలు చేసినట్లు రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి పత్రాలు సృష్టించినట్లు తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని అక్రమంగా మ్యుటేషన్‌ చేసిన అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్‌/డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

వ్యవహారం ఇలా జరిగింది..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 127లో 10.21 ఎకరాల భూమి 1977 వరకు వడ్డె హనుమ, అతడి వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 1978 నుంచి ఈ భూమి ‘మల్లయ్య’పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తోంది. మల్లయ్య పేరు ఉంది కానీ.. ఆయన ఇంటి పేరు లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే 1993–94 నుంచి ఈ భూమికి పట్టాదారుగా మల్లయ్యకు బదులు ‘దబ్బ మల్లయ్య’అనే కొత్త వ్యక్తి పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఆ తర్వాత 2001–02 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరు తొలగించారు. ఆ తర్వాత ఇ.మల్లయ్య అనే మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు.

2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌/తహసీల్దార్‌ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకొనే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమి రాశారు. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహశీల్దార్‌ మళ్లీ ఈ వివరాలు సవరిస్తూ.. లక్ష్మయ్య కేవలం ముప్పైఒకటిన్నర గుంటల్లో కాస్తులో ఉన్నట్లు రాశారు. ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 గుంటలు రాయడం, మళ్లీ సవరించి ముప్పైఒకటిన్నర గుంటలకు మార్చడం రెండూ తహశీల్దార్‌ అధికార పరిధిని అతిక్రమించినట్లు విచా రణలో తేలింది. ఈ ముప్పైఒకటిన్నర గుం టల భూమిని అనుముల రేవంత్‌రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్‌ డీడ్‌ రాసు కున్నారు. ఈ సేల్‌ డీడ్‌ ఆధారంగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా తహసీల్దార్‌ వ్యవహరించారు. రేవంత్‌రెడ్డి పేరును ఈ భూమి కి హక్కుదారుడిగా పేర్కొం టూ 2005లో అప్పటి తహసీల్దార్‌ రికార్డుల్లో ఎంట్రీ చేశారు.

ఎలాంటి ఆధారాల్లేకుండానే ఇ.లక్ష్మయ్య మరో ఎకరం ఇరవై తొమ్మిదిన్నర గుంటల భూమిని కొండల్‌రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్‌రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్‌ చేశారు. 
ఎలాంటి ఆధారాలు లేకున్నా తన పేరు మీద పత్రాలు సృష్టించడం ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే మహిళకు అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్‌) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి.. ఎ.కొండల్‌రెడ్డి పేరు మీదకు బదిలీ చేశారు. ఇదే సర్వే నంబర్‌లోని మరో ఎకరం 24 గుంట లను అలీసల్మాన్‌ బిన్, మహఫూజ్, హబీబ్‌ అబ్దుల్‌ రహీం, ఎ.వెంకటరావు, ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లు 2014లో కొండల్‌రెడ్డి సేల్‌ డీడ్‌ చేసుకున్నారు.

రెవెన్యూ రికార్డుల్లో భూ విక్రేతలకు సంబంధించి ఎలాంటి ఎంట్రీలు లేకపోయినా, స్థానిక తహసీల్దార్‌ సేల్‌ డీడ్‌ ఆధారంగా కొండల్‌రెడ్డి పేరు మీద భూమిని మ్యుటేషన్‌ చేశారు.1989లో ఎ.వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి 1 ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద ఈ భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదు. వెంకటరావు అనే మరో వ్యక్తి ఈ భూమిలోని పదమూడున్నర గుంటల భూమిని ఆ తర్వాత ఎ.కొండల్‌రెడ్డి పేరు మీదికి బదలాయించారు.

హక్కుదారులెవరో స్పష్టత లేకున్నా..
గోపనపల్లిలోని సర్వే నంబర్‌ 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు. అయినా తప్పు డు డాక్యుమెంట్ల ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు, తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని కలెక్టర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు