కో‘దడ’

12 Aug, 2014 00:56 IST|Sakshi
కో‘దడ’

సాక్షిప్రతినిధి, నల్లగొండ :కోదాడ మున్సిపాలిటీలో బహిరంగంగానే వ్యాపారం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టణంలోని వివిధ వార్డుల్లో రూ.3.50కోట్ల అంచనావ్య యంతో సీసీ రోడ్లు, కల్వర్టులు, సైడ్‌డ్రెయిన్లు, పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందే, పబ్లిక్ హెల్త్ ఈఈ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ (సూర్యాపేట ఆర్డీఓ) అనుమతి మేరకు ఈ ఏడాది జనవరి 27వ తేదీన టెండర్ నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన టెండర్లు జరిగాయి. మే 20వ తేదీన టెండర్లను ఆమోదించి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు అప్పగించారు. అయితే, ఆ సమయంలో ఎన్నికలకోడ్ అమలులో ఉండడంతో పనులు మొదలుపెట్టలేదు. బీఆర్‌జీఎఫ్, ఎస్‌ఎఫ్‌సీ, 13వ ప్రణాళిక సంఘం నిధులతో పూర్తి కావాల్సిన రూ.3.50కోట్ల పనులపై కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్ల కన్ను పడింది.
 
 తాజా కథ..
 తమ మున్సిపాలిటీలో ఏకంగా రూ 3.50కోట్లతో పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన కౌన్సిలర్లు, పాలకవర్గం కొలువు దీరేదాకా పనులు మొదలు పెట్టొద్దని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బ్రేక్ వేయించారు. రకరకాల మలుపులు తిరిగిన రాజకీయంతో పాలకవర్గం పగ్గాలు పుచ్చుకున్న కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఈ పనులు తక్షణ ఆదాయవనరుగా కనిపించాయి. తమ వార్డుల్లో చేపట్టే పనుల్లో కచ్చితంగా తమకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని కౌన్సిలర్లు అడ్డం పడడం మొదలుపెట్టారు. అంచనా వ్యయంపై 10శాతం కౌన్సిలర్లు, 3శాతం చైర్మన్, 10శాతం ఆఫీసు ఖర్చులు, 1శాతం వైస్‌చైర్మన్‌కు ఇలా.. పర్సెంటేజీలు ముట్టజెప్పాలని గొడవ జరుగుతోందని కోదాడ మున్సిపాలిటీలో జోరుగాప్రచారం జరుగుతోంది. పర్సెంటేజీలు ఇవ్వకుంటే పనులు రద్దు చేసుకుని వెళ్లిపోవాలని, తామే మళ్లీ టెం డర్లు వేసి పనులు చేయించుకుంటామని బెది రింపులకు దిగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారు.
 
 తమ డిమాండ్లకు తలొగ్గని కాంట్రాక్టర్లు చేపడుతున్న పనుల వద్దకు వెళ్లి, నాణ్యత ప్రమాణాల్లేవు అంటూ నానా హడావిడి చేసి పత్రికలకు ఎక్కుతున్నారని, వాస్తవానికి పనులు పూర్తయ్యాక ‘క్వాలిటీ కంట్రోల్’ చెకింగ్ జరిగి, అప్రూవల్ వస్తేనే ఫైనల్ బిల్లు చెల్లిస్తారని, కానీ, కావాలనే కొందరు కౌన్సిలర్లు నాణ్యత తనిఖీల పేర హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పనులు జనరల్ ఫండ్‌తో చేపట్టినవి కాదు. ఈ పనులపై కౌన్సిలర్లకు ఎలాంటి అజమాయిషీ ఉండదు. ఇక, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేది లేదని, నయాపైస ఇవ్వడానికి కూడా చెక్‌పవర్ లేని పాలకవర్గ పెద్దలు కొత్తకొత్త కండీషన్లు పెడుతున్నట్లు సమాచారం.  
 
 ఎన్నికల ఖర్చు రాబట్టుకునే పనిలో..
 ‘‘కోదాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలిచేందుకు కనీసం పాతిక  లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటాం. మా ఖర్చులు మేం రాబట్టుకోవద్దా’’ అన్న తరహాలో కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, కోదాడలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోను మెజారిటీ కాం గ్రెస్‌కు రాలేదు.
 
 ఈ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు పెద్ద కసరత్తే చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలోనూ డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ ఖర్చులన్నీ రాబట్టుకునేందుకు గృహనిర్మాణ అనుమతులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వంటి వాటి దాకా ఏదీ తమకు తెలియకుండా పనిచేయొద్దని అధికారులకు పాలకవర్గ పెద్దలు హుకుం జారీ చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల మున్సిపాలిటీల్లో బీఆర్‌జీఎఫ్ నిధుల కింద ప్రదొవార్డుకు బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో అన్ని వార్డులకు సమంగా బడ్జెట్ కేటాయించారని, కానీ, కాం గ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం తమ వార్డులకు ఎక్కువ నిధులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువ నిధులతో పనులు చేపడితే, ఎక్కువ పర్సెంటేజీలు వస్తాయన్న కారణంతోనే పేచీ పెడుతున్నారని విపక్ష కౌన్సిలర్లు విమర్శలకు దిగుతున్నారు.
 
 ఇదీ.. ఉదాహరణ !
 కోదాడ మున్సిపాలిటీలో చేపడుతున్న ఈ పనుల్లో కొన్నింటికి ఓ కాంట్రాక్టర్  16శాతం తక్కువ కోట్  (లెస్ టెండర్) చేసి దక్కించుకున్నారు. అంటే లక్ష రూపాయల విలువైన పనిని రూ.84వేలకే పూర్తి చేస్తానని ముందుకొచ్చినట్టు లెక్క. ప్రచారం జరుగుతున్న పర్సెంటేజీల ప్రకా రం ఇందులో రూ.24వేలు కూడా తీసివేస్తే, ఇక మిగిలేది రూ.60వేలు. అంచనా వ్యయంపై సీఎస్‌టీ, జీఎస్‌టీ, ఈఎండీ వంటి ఖర్చులన్నీ వెళ్లాలి. ఇందులోనే కాంట్రాక్టర్ తన లాభం కూడా చూసుకోవాలి. ఇక, మిగిలే సొమ్మెంత..? ఆ సొమ్ముతో చేపట్టే పనిలో నాణ్యత ఎంత..?
 

 

మరిన్ని వార్తలు