అధికారం కోసమే కూటమి ఏర్పాటు

30 Nov, 2018 09:37 IST|Sakshi
వనపర్తిలో రాజ్‌నాథ్‌సింగ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న బీజేపీ జిల్లా నాయకులు, వనపర్తి అభ్యర్థి అమరేందర్‌రెడ్డి  

అపవిత్ర పొత్తుతో అభివృద్ధి కుంటు  

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం  

వనపర్తి ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  

సాక్షి, వనపర్తి:  కాంగ్రెస్, టీడీపీల పార్టీల కలయిక అపవిత్రమైనదని, అధికారం కోసమే ప్రజాకూటమిగా ఏర్పడ్డారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించారని అన్నారు. కానీ చంద్రబాబు అదేపార్టీతో జతకట్టడం చూస్తే అధికారమే వారి లక్ష్యమని, ప్రజా సమస్యలు, అభివృద్ధి వారికి పట్టవనే విషయం స్పష్టమవుతోందని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వనపర్తిలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కొత్త అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏ పార్టీ అయినా కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయవద్దని, అభివృద్ధి, సంక్షేమం తద్వారా దేశఅభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని హితవు పలికారు.

గతంలో బీజేపీ ప్రభుత్వం చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేయగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వెనుకబడుటకు గల కారణాలను చెప్పాలని కేసీఆర్, చంద్రబాబును కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ మానవ వనరులు, నైపుణ్యం, ప్రకృతి వనరులకు ఎలాంటి కొరత లేదన్నారు. ఇక్కడి రాజకీయ నాయకుల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంలేదని అందుకే వెనుకబాటుకు గురవుతున్నాయని అన్నారు.  


నిధుల దారి మళ్లింపు  
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని, కేసీఆర్‌ అడ్డుకుంటున్నాడని, ఇళ్లులేని నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో మోది ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం మద్దతు ధరను పెంచిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు.  


అభివృద్ధి చేయలేదు కాబట్టే..  
టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి చేయలేదు కాబట్టే, ప్రజల దృష్టిని మరల్చడానికి మెనార్టీల రిజర్వేషన్‌ల అంశాన్ని కేసీఆర్‌ తెరపైకి తెస్తున్నాడని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. ఎవరి రిజర్వేషన్‌లను తొలగించి మైనార్టీలకు రిజర్వేషన్‌లు కల్పించాలో, ఎలాంటి రాజ్యాంగ బద్దంగా అది సాధ్యమవుతుందో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ 55ఏళ్ల పాలనలో దేశంలో కేవలం 2 సెల్‌ఫోన్‌ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయని కానీ నేడు 120 సెల్‌ఫోన్‌ ఉత్పత్తి చేసే కంపనీలు దేశంలో నెలకొల్పబడ్డాయని తెలిపారు.  


మరో ఆరు నెలలకు వస్తా  
2019 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని , తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆరు ఇంతలు చేస్తామని అన్నారు. దేశంలో సుపరిపాలన అందించడం బీజేపీకి మాత్రమే సాధ్యమని, గుజరాత్‌లో గడిచిన 22ఏళ్లుగా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో గడిచిన 15ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నామని అన్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయినా అక్కడ మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు.

ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. వనపర్తిలో అభ్యర్థి అమరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శృతి, నాయకులు బి.కృష్ణ, సబ్బిరెడ్డివెంకట్‌రెడ్డి, బి.పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

 
తెలుగులో మాట్లాడిన సింగ్‌ 
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. సోదరి, సోదరిమణులారా.. మీ అందరికీ నమస్కారాలు.. ఈ సభలోని మీ అందరికీ అభినందనలు. ఇంత పెద్దఎత్తున సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అమర వీరులకు జోహార్లు అని తెలుగులో చెప్పారు.  

మరిన్ని వార్తలు