ఆల్మట్టి @ లక్ష క్యూసెక్కులు 

16 Jul, 2018 01:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. రోజురోజుకీ ప్రాజెక్టులోకి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోపక్క తుంగభద్రలోనూ అదే రీతిలో ప్రవాహాలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిండేందుకు సిద్ధమవు తోంది. ఇక నారాయణపూర్‌లోనూ ఇప్పటికే చెప్పుకోదగ్గస్థాయిలో ప్రవాహాలు న్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండేందుకు మరో 50 టీఎంసీలు అవసరముంది. శ్రీశైలానికి  కనీసం 40 టీఎంసీలు చేరినా దిగువ జూరాలకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. 

గతం కంటే 48 టీఎంసీలు ఎక్కువ.. 
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షా లతో ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. కృష్ణానది విశ్వరూపం చూపిస్తోంది. అక్కడి  ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు చేరింది.

రోజుకు ఏకంగా 9 టీఎంసీలు వస్తుండ డంతో  నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నీటినిల్వ 129.72 టీఎంసీలకుగాను 93 టీఎంసీలకు చేరింది. 36.72 టీఎంసీ లు చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారనుంది. గతేడాది ఇదే సమయానికి ఆల్మట్టి లో 48 టీఎంసీలే ఉండగా ఈసారి రెట్టిం పునిల్వలుండటం ఊరటనిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు