రాకపోకలు బంద్‌!

26 Mar, 2020 02:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రామాలకు వచ్చే రహదారికి కంచెలు

అత్యవసరమైతే ఎలాగంటున్న ప్రజలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి బయటివ్యక్తులు రాకుండా ప్రధాన రహదారికి అడ్డంగా తుమ్మ, కంప కొమ్మలు ఏర్పాటు చేశారు. పెద్ద మొత్తంలో వీటిని ఏర్పాటు చేయడంతో పెద్ద వాహనాలే కాదు.. బైక్‌లు, సైకిళ్లు సైతం రాని పరిస్థితి. కేవలం ఈ ఒక్క గ్రామమే కాదు..మండల పరిధిలోని 10 గ్రామ పంచాయతీల్లో అదేవిధంగా జాగ్రత్త చర్యలు చేపట్టాయి. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఆదేశాలతో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఈమేరకు ఏర్పాట్లు చేశాయి. ఇబ్రహీంపట్నం మండలంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో అధికారులు చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలకు దాదాపు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వచ్చేనెల 14 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  స్వీయ నిర్బంధం విధించుకోవడమే ఏకైక మార్గమని సీఎం కేసీఆర్‌ సైతం పలుమార్లు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాలు గ్రామానికున్న ప్రధాన రహదారులను మూసివేస్తున్నాయి.

ఈ ప్రక్రియతో గ్రామ రక్షణ కట్టుదిట్టమైనప్పటికీ..గ్రామంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎలాగనే ప్రశ్న వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ అయినప్పటికీ రైతు లు, వ్యసాయ కూలీలు, సాగుపనులు, నీటిపారుదల పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో రోజువారీగా వారి కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి. పంటపొలాల నుంచి దిగుబడులు తీసుకురావాలంటే వాహనాల రాకపోకలు తప్పనిసరి. ఈ క్రమంలో గ్రామం లోపలికి వచ్చే ప్రధాన రహదారులను మూసివేస్తే దిగుబడులు ఎలా తీసుకు రావాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎమర్జెన్సీకి ఇబ్బందులు...
అనారోగ్య కారణాలు, ఇతర ఎమర్జెన్సీ సందర్భాల్లో గ్రామం దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు వాహనాల్లో పొరుగూరికి వెళ్లాలన్నా..ఇతర ప్రాంతాల నుంచి వైద్యుడో ఇంకెవరైనా గ్రామంలోకి రావాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసర దుకాణదారులు మార్కెట్‌కు వెళ్లనప్పటికీ..సరుకులు మాత్రం దిగుమతి చేసుకోవాలి.  పౌల్ట్రీ రైతులకు అవసరమైన సరకులు, నిర్దేశిత సమయానికి ఎదిగిన కోళ్లను తరలించడం... రైతులు పొలాలకు వెళ్లాల్సి రావడం, కూలీల రాకపోకలకు ప్రధాన రహదారులే కీలకం. ఇలాంటి సందర్భంలో ప్రధాన రహదారులకు మూసివేయకుండా తాత్కాలిక ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలనే భావన వ్యక్తమవుతోంది. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేయడం కంటే తాత్కాలికంగా ఫెన్సింగ్‌ విధిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు