ఇసుకకు బదులు ఇవీ..!

28 Jun, 2019 07:57 IST|Sakshi

ఇసుకకు ఉన్న డిమాండ్‌.. దాని చుట్టూ నడుస్తున్న రాజకీయాలు, అరాచకాలు ఏ ఒక్కప్రాంతానికో పరిమితం కాలేదు. తెలుగురాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఇసుక చుట్టూ ఎన్నో వివాదాలు రాజుకున్నాయి. ఇంటి నిర్మాణం మొదలుకుని.. భారీ ప్రాజెక్టుల వరకూ ప్రతిచోటా ఇసుక పాత్ర అత్యంత కీలకం. అందులోనూ నదీ పరీవాహక ప్రాంతాల్లో దొరికే ఇసుకంటే.. కాంక్రీట్‌ తయారీలో డిమాండ్‌ మరీ ఎక్కువ. అందుకే.. ఆంధ్రప్రదేశ్‌లో గత పాలకపక్షం ఇసుక తరలింపు విషయంలో అన్ని రకాల అక్రమాలకూ తెగబడిన సంగతి తెలిసిందే. అయితే కాంక్రీట్‌ తయారీలో ఇసుకే తప్పనిసరిగా ఉండాలా? వేరే ప్రత్యామ్నాయమే లేదా? అనేదానిపై ఎన్నో  పరిశోధనల తర్వాత కొన్ని ప్రత్యామ్నాయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పైగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నదులను పరిరక్షించుకోవడంతోపాటు వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకూ ఈ ప్రత్యామ్నాయ ఇసుక పదార్థాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రమాదకర స్థాయిలో ఇసుక వినియోగం
దేశంలో తలసరి కాంక్రీట్‌ వినియోగం ఒక టన్ను. దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ మౌలిక వసతులు, ఇతర నిర్మాణ పనుల కారణంగా ఏటా దాదాపు 45కోట్ల ఘనపు (క్యూబిక్‌) మీటర్ల కాంక్రీట్‌ ఖర్చయిపోతోంది. ఇందులో కనీసం మూడోవంతు అంటే 15కోట్ల ఘనపు మీటర్ల ఇసుక వినియోగం జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే. అయినప్పటికీ మన పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది ప్రమాదకరమైన విషయమే. నదుల్లో ఇసుక రేణువులు తయారయ్యేందుకు వందల, వేల సంవత్సరాలు పడితే.. అంతకంటే చాలా వేగంగా మనం వాటిని ఖాళీ చేసేస్తుండడమే దీనికి కారణం. ఈ ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇసుకకు మనచుట్టూ ఎన్నో ప్రత్యాయ్నా యాలు, వాటి వినియోగం, సామర్థ్యాలపై పూర్తిస్థాయి పరిశోధనలు జరిగాయి.

రాగి తయారీ వ్యర్థాలు
ముడి ఖనిజం నుంచి రాగిని తయారు చేసే క్రమంలో ఖనిజంలోని వ్యర్థాలు వేరుపడతాయి. ‘కాపర్‌ స్లాగ్‌’ అని పిలిచే ఈ వ్యర్థాలను ఇసుకతో కలిపి కాంక్రీట్‌ను తయారు చేసుకోవచ్చని సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) ఎప్పుడో గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 కోట్ల టన్నుల కాపర్‌ స్లాగ్‌ ఉత్పత్తి అవుతూంటే.. భారత్‌లో ఈ మొత్తం దాదాపు 65 లక్షల టన్నులకు పైనే ఉంటుంది. నది ఇసుక, కాపర్‌స్లాగ్‌ రెండింటిని సమపాళ్లలో కలుపుకుని తయారు చేసే కాంక్రీట్‌ సాధారణ కాంక్రీట్‌ కంటే దృఢంగా ఉంటుందని ఒమన్‌ శాస్త్రవేత్త ఖలీఫా ఎస్‌.అలీ 2006 నాటి పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. పేవ్‌మెంట్‌ స్థాయి కాంక్రీట్‌ తయారీలో 40%  కాంక్రీట్‌ వాడటం వల్ల అదే స్థాయి సాధారణ కాంక్రీట్‌ కంటే 20% ఎక్కువ శక్తి కలిగి ఉంటుందని సీఆర్‌ఆర్‌ఐ ధ్రువీకరించింది.

ఉక్కు పరిశ్రమ వ్యర్థాలు
సిమెంట్‌ పరిశ్రమపై భారత ప్రభుత్వ వర్కింగ్‌ గ్రూప్‌ 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా తయారు చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ఉక్కు, ఇనుము పరిశ్రమలు దాదాపు కోటి టన్నుల బ్లాస్ట్‌ ఫర్నెస్‌ స్లాగ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని నదుల ఇసుకకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చునని, తద్వారా కాంక్రీట్‌ కంప్రెసివ్‌ స్ట్రెంగ్త్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతుందని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ స్ట్రక్చర్‌ అండ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ (2013)లో ఎంసీ నటరాజ అనే శాస్త్రవేత్త ప్రచురించిన పరిశోధన వ్యాసం చెబుతోంది. ఈ బ్లాస్ట్‌ ఫర్నెస్‌ స్లాగ్‌ను వాడటం ద్వారా దాదాపు 75% ఇసుకను ఆదా చేయవచ్చు కూడా. కాపర్‌ స్లాగ్, ఫెర్రస్‌ స్లాగ్‌ (ఇనుము తయారీ వ్యర్థం)లను కలిపి వాడితే నదీ ఇసుకను వాడాల్సిన అవసరమే ఉండదని మరో పరిశోధన వ్యాసం వెల్లడించింది. అయితే కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే 80% ప్రత్యామ్నాయంగా వాడటమే మంచిదని తమిళనాడులోని కేఎల్‌ఎన్‌ కాలేజీ తన పరిశోధనలో పేర్కొంది. ఎస్సార్‌ స్టీల్‌ లాంటి కంపెనీలు ఈ దిశగా ఇప్పటికే ముందడుగు వేశాయి కూడా.

క్వారీల దుమ్ము
స్టోన్‌ క్రషర్లలో వృథాగా మిగిలిపోయే దుమ్మును ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే వాడుతున్నారు. రోబోశాండ్‌ పేరుతో అందు బాటులో ఉన్న ఈ క్వారీ డస్ట్‌ 55–75% ఇసుకను ఆదా చేస్తుంది. ఒకవేళ ఫ్లైయాష్‌తో కలిపితే ఇసుకకు బదులుగా ఈ మిశ్రమాన్ని వాడుకోవచ్చు. ఫ్లైయాష్‌ను వాడటం ద్వారా కాంక్రీట్‌లోకి నీరు చొరబడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఫ్లైయాష్‌ వాడకంతో కాంక్రీట్‌ ప్రాథమిక శక్తి స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నందున దీన్ని క్వారీడస్ట్‌తో కలిపి వాడటం మేలని అంచనా.

థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి..
బొగ్గును మండించడం ద్వారా విద్యుదుత్పత్తి జరిగే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో ఫ్లైయాష్‌ వ్యర్థంగా ఉత్పత్తి అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇటుకల తయారీతోపాటు అనేక ఇతర అవసరాలకు దీన్ని వాడుతున్నారు. అయితే ఇది ఇసుకకు ప్రత్యామ్నాయమనే సంగతే చాలామందికి తెలి యదు. పవర్‌ ప్లాంట్‌ వ్యర్థాల్లో ఫ్లైయాష్‌ దాదాపు 80% ఉంటే.. మిగిలింది బాటమ్‌ యాష్‌. సరైన పద్ధతుల్లో ఈ బాటమ్‌ యాష్‌ను నిల్వ చేయకపోతే పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అయితే కొంచెం శుద్ధి చేసిన బాటమ్‌ యాష్‌ (30%).. ఇసుక మిశ్రమంతో తయారు చేసిన కాంక్రీట్‌ బలంగా ఉంటుందని అంతర్జాతీయస్థాయి పరిశోధనలు చెబుతున్నాయి.

ఫౌండ్రీ ఇసుక
ప్రపంచవ్యాప్తంగా ఫౌండ్రీ ఉత్ప త్తుల తయారీలో భారత్‌ది 4వ స్థానం. ఈ క్రమంలో ఏటా వెలువడే వ్యర్థాలు 78 లక్షల టన్నులు. అత్యధిక సిలికా పదార్థం ఉండే ఈ ఫౌండ్రీ సాండ్‌ను లోహ పరి శ్రమదారులు వృథా చేస్తూంటారు. ఈ వ్యర్థాన్ని వాడు కోగలిగితే కాంక్రీట్‌ తయారీలో 30% వరకూ ఇసుకను ఆదా చేయవచ్చు.

భవనాల వ్యర్థాలూ పనికొస్తాయి
కూల్చేసిన భవనాలు, నిర్మాణాల వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో పారబోయడం ప్రస్తుతం మనం చేస్తున్న పని. దేశం మొత్తమ్మీద ఈ వ్యర్థాల మోతాదు ఎంత అన్న దానిపై స్పష్టమైన అంచనాలేవీ లేవు. ఒక్క న్యూఢిల్లీలోనే రోజుకు దాదాపు 4వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు ల్యాండ్‌ ఫిల్స్‌కు చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యర్థాలను వాడటం ద్వారా ఇసుక వాడకాన్ని తగ్గించవచ్చునని.. కాకపోతే సాధారణ కాంక్రీట్‌తో పోలిస్తే దీని శక్తి 10–15% తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ.. భవనానికి శక్తినిచ్చే స్తంభాలు, పైకప్పులకు బదులు ఫ్లోరింగ్‌ తదితర పనులకు ఈ కాంక్రీట్‌ వినియోగం నష్టమేమీ కాదని వీరు అంటున్నారు. ఢిల్లీలో ఇప్పటికే భవన నిర్మాణ వ్యర్థాలను శుద్ధిచేసే ప్రత్యామ్నాయ ఇసుక తయారీ కేంద్రాలున్నాయి.
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు