అంబేడ్కర్ అందరివాడు

11 Apr, 2016 01:13 IST|Sakshi

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ అందరివాడని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు.  భారతరత్న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ రికార్డు పెయింటింగ్ ఈవెంట్ నిర్వహిం చారు. ఈ పోటీలో 125 మంది చిన్నారులు పాల్గొని 125 నిమిషాల పాటు కుంచెకు పదునుపెట్టి 125 చదరపు అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ చిత్రాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి కాన్సెప్ట్ స్కూళ్లలో విద్యార్థుల వరకు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరందరూ 13 ఏళ్ల వయసు లోపువారే. ఇందులో ఒక్కొక్కరికి ఒక భాగాన్ని కేటాయించారు.
 
 
విద్యార్థుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలన్నింటినీ ఒకే చిత్రంగా అతికించి.. అంబేడ్కర్ జీవిత ఘాట్టాలను తెలియజేసే అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. బాలబాలికలు ఆవిష్కరించిన చిత్రాన్ని చూసి ఆశ్చర్యచకితుల య్యారు. విద్యార్థులందరూ మహాయజ్ఞం చేసి అంబేడ్కర్ చిత్రాన్ని రూపొందించారని ప్రశంసించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికీ పాటుపడిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఇ.సుధారాణి, దిశా సైన్స్ సెంటర్ నిర్వాహకులు డి.అనసూయమ్మ, నేషనల్ దలిత్ ఫోరం అధ్యక్షుడు ఆర్.రవికుమార్, డి.వి.ఎస్.ఎం. చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు