స్కైవే..సందిగ్ధం

23 Aug, 2018 09:31 IST|Sakshi

మూసీ స్కైవాక్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై తకరారు

ఏకపక్షంగా నివేదిక రూపొందించారని ఆందోళన

కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగోదిగా నిలిచిన ‘మూసీ’ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరీకరణ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఇందులో భాగంగా చేపట్టనున్న ఈస్ట్‌– వెస్ట్‌ కారిడార్‌(స్కైవే)కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు జారీచేసే అంశంపై ఎటూ తేల్చడం లేదు.

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఈస్ట్‌– వెస్ట్‌ కారిడార్‌(స్కైవే) ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు జారీచేసే అంశంపై సందిగ్ధత వీడడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, స్టేట్‌లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ)లు రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక ఏకపక్షంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ వేత్తలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే  హడావుడిగా నివేదిక రూపొందించారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) నివేదించారని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ప్రాజెక్టు స్వరూపం..
రీచ్‌1: ఉస్మాన్‌సాగర్‌ హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల నుంచి బాపూ ఘాట్‌వరకు(19 కి.మీ) చూడముచ్చటైన రహదారిని తీర్చిదిద్దడం. అంచనా వ్యయం రూ.647.98 కోట్లు
రీచ్‌2: బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి(21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటుకు రూ.2162.01కోట్లు
రీచ్‌3: నాగోల్‌బ్రిడ్జి నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కి.మీ) మార్గంలో అప్రోచ్‌ రోడ్‌ ఏర్పాటు రూ.155.52 కోట్లు.

ప్రస్తుత దుస్థితి ఇదీ..  
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడినుంచి సుమారు 90 కి.మీ మేర ప్రవహించి ఈ నది బాపూఘాట్‌ వద్ద హైదరాబాద్‌ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ప్రవేశిస్తోంది. నిత్యం గృహ, వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 1400 మిలియన్‌ లీటర్ల మురుగునీరు నిత్యం ఈ నదిలోకి ప్రవేశిస్తోంది. ప్రధానంగా జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థజలాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాల్లో జలమండలి నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్‌పేట్‌ మురుగు శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి ఈ నదిలోకి వదిలిపెడుతోంది. మిగతా 700మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు పదిచోట్ల నూతనంగా మురుగుశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్‌ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నది జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నది నాలుగోస్థానంలో నిలవడం ఈ నది దుస్థితికి అద్దం పడుతోంది.

మూసీ ప్రక్షాళన రెండోదశకు రూ.1200 కోట్లు అవసరం.. .
మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాల్సి ఉంది.  ఇందుకు రూ.1200  కోట్లు వ్యయం చేయాల్సి ఉంది.  మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం..పది సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది.
ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్‌పేట్‌(142ఎంఎల్‌డి),నాగోల్‌(140ఎంఎల్‌డి), నల్లచెరువు (80ఎంఎల్‌డి), హైదర్షాకోట్‌ (30), అత్తాపూర్‌ (70ఎంఎల్‌డి), మీరాలం(6ఎంఎల్‌డి), ఫతేనగర్‌ (30ఎంఎల్‌డి), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌ (59ఎంఎల్‌డి), నాగారం(29ఎంఎల్‌డి), కుంట్లూర్‌హయత్‌నగర్‌ (24 ఎంఎల్‌డి) రీసైక్లింగ్‌ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్, నాగారం కాప్రా

పర్యావరణ ప్రభావనివేదిక లోపభూయిష్టం
మూసీరివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. మూసీ ప్రవాహమార్గంలో ఏర్పాటుచేసిన పలు వాణిజ్య, నివాస సముదాయాలతో మూసీ రోజురోజుకూ మూసుకుపోతోంది. చాదర్‌ఘాట్‌ వద్ద మూసీ ప్రవాహమార్గంపైనే మెట్రో స్టేషన్,దాని పక్కనే ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటుచేశారు. భారీ వర్షాలు,వరదలు వచ్చినపుడు వీటి మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. మూసీఅభివృద్ధి ప్రాజెక్టుపై పర్యావరణ వేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరవాతే పనులు మొదలుపెట్టాలి. మూసీ రివర్‌ మేనేజర్‌మెంట్‌ కమిటీ ఏర్పాటుచేసి చారిత్రక నదిని పరిరక్షించాలి.– ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి,పర్యావరణవేత్త

మరిన్ని వార్తలు