అంబులెన్స్‌కే ఆపద కుయ్‌.. కుయ్‌ రాస్తా నై!

1 Nov, 2019 11:59 IST|Sakshi
అంబులెన్స్‌లో శిశువుకు జన్మనిచ్చిన నాగలక్ష్మి

నగర ట్రాఫిక్‌లోచిక్కుకుంటున్నఎమర్జెన్సీ వెహికల్స్‌  

ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారినరహదారులు  

గుంతలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌  

108, ఇతర అంబులెన్స్‌లకు దొరకని దారి  

బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో జాప్యం  

వాహనాల్లోనేప్రసవిస్తున్న గర్భిణులు  

సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో మరణిస్తున్న అనారోగ్య బాధితులు  

బోడుప్పల్‌కు చెందిన గర్భిణి నాగలక్ష్మికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108 అంబులెన్స్‌లో తీసుకొని ఆస్పత్రికి బయలుదేరారు. అప్పటికే రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉండడం, చాలాచోట్ల రహదారులపై గుంతలు ఉండడతో వాహనాల వేగం నెమ్మదించింది. వాస్తవానికి 15 నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవాల్సిన వాహనం అరగంటకు పైగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుంది. అప్పటికే నొప్పులతో బాధపడుతున్న నాగలక్ష్మి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చాదర్‌ఘాట్‌ వద్ద టెక్నీషియన్లు శ్రీనివాస్, రామ్‌దాస్‌ కాన్పు చేశారు. అనంతరం తల్లీబిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు.

 25 రోజుల క్రితం బడంగ్‌పేటకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను 108లో ఆస్పత్రికితరలిస్తుండగా... నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపేశారు. బాధితురాలు అంబులెన్స్‌లోనే బిడ్డను ప్రసవించింది. 

సాక్షి, సిటీబ్యూరో :ఇలా ఒక్క గర్భిణులనే కాదు... 108, ఇతర అంబులెన్స్‌లలో వైద్యం కోసంఆస్పత్రులకు వెళ్తున్న బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ రద్దీనే ఇందుకుకారణమవుతోంది. ఓఆర్‌ఆర్‌ సహా శివారు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేర్చే క్రమంలో అంబులెన్స్‌లకు ట్రాఫిక్‌ అడ్డంకిగా మారింది. అంబులెన్స్‌లు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోకపోవడంతో గర్భిణులు ఆయా వాహనాల్లోనే ప్రసవిస్తుండగా... అనారోగ్య బాధితులు మృత్యువాతపడుతున్నారు.  
నగరంలో ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పీక్‌ అవర్స్‌గా పేర్కొనే ఉదయం 8:30–11గంటల వరకు.. మధ్యాహ్నం 12:30 నుంచి 2గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సమయాల్లో నగరంలోకి వచ్చే అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో పరిస్థితి విషమించి బాధితుల ప్రాణాల మీదకు వస్తోంది. వైద్య పరిభాషలో ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్‌ అవర్‌’గా పేర్కొంటారు. క్షతగాత్రులను ఈ సమయం లోపు ఆస్పత్రులకు తరలిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కానీ తరలింపులో జరుగుతున్న జాప్యంతో మరణాలు సంభవిస్తున్నాయి.

కారణాలెన్నో...  
వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు నగరంలో వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటోంది. అంబర్‌పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘట్, ఉప్పల్, సంతోష్‌నగర్, సైదాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో బాటిల్‌నెక్స్‌ ఉన్నాయి. పీక్‌ అవర్స్‌లో వాహనాలన్నీ ఒకేసారి రోడ్లపైకి వస్తుండడంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలనే సామాజిక స్పృహ చాలా మంది వాహనదారుల్లో ఇప్పటికీ లేకపోవడంతోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా 15 నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవాల్సిన అంబులెన్స్‌లు 30 నిమిషాలకు పైగా రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. 

గంటకు పైగా సమయం...  
గ్రేటర్‌ ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుమారు 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు పలు రాష్ట్ర, జాతీయ రహదారులు దీనికి ఆనుకొని ఉన్నాయి. ఈ రహదారులపై ఏటా రెండు వేలకు పైగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో 200–300 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది వికలాంగులుగా మారుతున్నారు. ప్రధాన నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక 108 అంబులెన్స్‌ ఉండగా.. అదే శివార్లలో ప్రతి 25–30 కిలోమీటర్లకు ఒకటి ఉంది. ఔటర్‌పై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్సు ఘటనాస్థలికి చేరుకోవాలంటే కనీసం గంటకు పైగా పడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత క్షతగాత్రులను ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించడానికి మరో గంటకు పైగా పడుతోంది. ఇలా ఔటర్‌ నుంచి ఆస్పత్రులకు బాధితులను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే ఇతర అంబులెన్సులకు సిటీలో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణ దూరానికి రోడ్లపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ తోడవుతుండటంతో అంబులెన్స్‌లు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోవడం లేదు.

మరిన్ని వార్తలు