అమీన్‌పూర్‌ దేవాలయంపై నేడు హైకోర్టులో విచారణ

26 Feb, 2020 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమీన్‌పూర్‌ వెంకటేశ్వర దేవాలయం నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పార్క్‌ స్థలంలో గుడిని అక్రమంగా నిర్మించారని హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ ట్రస్ట్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, సంగారెడ్డి కలెక్టర్‌, హెచ్‌ఎమ్‌డీఏ కమిషనర్‌, జిల్లా పంచాయతీ అధికారులతో పాటు అమీన్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శులు వ్యక్తిగతంగా నేడు హైకోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. కాగా దేవాలయ నిర్మాణం​పై చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ అఫిడవిట్ ధాఖలు చేసిన విషయం విదితమే. ఈ అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మళ్లీ సమగ్ర నివేదికతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. 

అంతేగాక దేవాలయానికి సంబంధించిన పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌గా ప్రవీణ్రెడ్డిని హైకోర్టు నియమించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక అడ్వకేట్ కమిషన్‌కు అయ్యే ఖర్చు రూ. 50 వేలు దేవాలయ కమిటీ చెల్లించాల్సిందిగా కోర్టు పేర్కొంది. ఇక దేవాలయ నిర్మాణానికి సంబంధించిన లే ఔట్, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అదేవిధంగా అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, కేసులు ఎందుకు నమోదు చేయలేదంటూ హైకోర్టు అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని విచారించాల్సిందిగా ప్రభుత్వాన్ని అదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర నివేదికను మార్చి 13వ తేది వరకు సమర్పించాలని అడ్వకేట్ కమిషన్‌, ప్రభుత్వ అధికారులకు ఆదేశించింది. కాగా తదుపరి విచారణను మార్చి 16 కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

మరిన్ని వార్తలు