రికార్డుల సవరణ.. రయ్‌.. రయ్‌..

7 Dec, 2017 02:15 IST|Sakshi

భూ రికార్డుల ప్రక్షాళనలో శరవేగంగా రికార్డుల సవరణ

ఇప్పటివరకు నమోదైన తప్పుల్లో 55 శాతానికి పైగా పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రికార్డుల సవరణ శరవేగంగా జరుగుతోంది. రికార్డులను పరిశీలించిన తర్వాత రైతుల వద్ద ఉన్న వివరాలకు, రికార్డులకు మధ్య ఉన్న తేడాలను రెవెన్యూ యంత్రాంగం సరి చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూముల రికార్డులను పరిశీలించారు. అందులో 45 లక్షలకు పైగా ఎకరాల భూమి సరి చేయాల్సిందిగా తేలింది. ఈ సరి చేయాల్సిన భూమిలో ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల రికార్డులను సరి చేసినట్టు భూ ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. ఆ ప్రకారం నమోదైన మొత్తం తప్పుల్లో 55 శాతం వరకు రికార్డులను సరి చేశారు. మరోవైపు రెవెన్యూ రికార్డులను సరి చేసేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సొమ్ములు అడుగుతున్నారని, చిన్న తప్పులను కూడా కాసులు లేనిదే సరిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం.

చాలా వరకు చిన్న సవరణలే..
వాస్తవానికి రికార్డుల సవరణకు అవసరమైన విషయాలను పరిశీలిస్తే చాలా వరకు చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళనలో అర్థమవుతోంది. ఎక్కువగా సర్వే నంబర్లలో తప్పులు, పట్టాదార్ల పేర్లలో క్లరికల్‌ తప్పులు, పౌతి చేయాల్సినవి, ఆన్‌లైన్‌ రికార్డుల్లో ఎక్కించాల్సినవి, మ్యుటేషన్‌ అప్‌డేట్‌ చేయాల్సినవి, పాస్‌ బుక్కుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించాల్సినవి.. ఇలా అన్నీ ఉన్నపళంగా సరి చేసేందుకు వీలైన తప్పులే 90 శాతానికి పైగా నమోదవుతున్నాయి. ఇక కోర్టు కేసులు, అటవీ భూములు, అసైన్డ్‌ భూముల్లో నమోదవుతున్న పొరపాట్లను ఇప్పటికిప్పుడు సరిచేసే అవకాశం లేదు. దీనికితోడు దాదాపు 3 లక్షల సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటే రికార్డుల్లో తక్కువగా ఉండటం, రికార్డుల్లో ఎక్కువగా ఉండి భూమి తక్కువ ఉండటం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డులను కూడా సర్వే చేయకుండా నివృత్తి చేయలేని పరిస్థితి. ఇలాంటివన్నీ కలసి 10 శాతం వరకు ఉంటున్నాయి. కోర్టు కేసులైతే ఇప్పటివరకు 24 వేల సర్వే నంబర్లలోని భూముల్లోనే వచ్చాయి. అసైన్డ్, ఫారెస్టు అన్నీ కలిపినా 85 వేల సర్వే నంబర్లకు మించలేదు. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే సరికి కూడా ఈ గణాంకాల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. దీంతో చిన్న తప్పులను సరిచేసేందుకు పెద్దగా సమయం తీసుకోవడం లేదని, రైతుల అంగీకారంతో రికార్డులను సవరించి 1బీ ఫారాలు ఇచ్చి సంతకాలు తీసుకుంటున్నామని, వాటిని గ్రామసభల్లో అంటిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది.

31 నాటికి కష్టమే
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పుల సవరణ శరవేగంగా జరుగుతున్నప్ప టికీ డిసెంబర్‌ 31 నాటికి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల సవరణ లో భాగంగా రోజుకు 40 వేల వరకు సర్వే నంబర్లను సరి చేస్తున్నామని, అలా చేసినా మరో 10 లక్షలకు మించి పూర్తయ్యే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇంకా వేగంగా చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశముం దని, దీనికితోడు ఈ రికార్డులను ఆన్‌లైన్‌ చేసేందుకు ఇంకా సమయం తీసుకుంటుంద ని వారంటున్నారు. ప్రక్రియ  సజావుగా సాగాలంటే కనీసం మరో నెలరోజులైనా గడువును పొడిగించాలని కోరుతున్నారు.

‘ఆమ్యామ్యాలు’ ఇవ్వాల్సిందే..!
రికార్డుల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో ‘ఆమ్యామ్యాలు’ నడుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరి చేసేందుకు ఎకరాల లెక్కన రైతుల నుంచి రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేసి తప్పులు సరి చేస్తున్నారని, ఇదేమంటే తాము పై అధికారులకు ఇచ్చుకోవాలని వీఆర్వోలు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. అయితే అందరు సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయకపోయినా, రైతు అవసరాన్ని బట్టి గట్టిగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు