పునరావాసం కల్పించాల్సిందే..

16 Jun, 2018 01:51 IST|Sakshi

అలా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది 

చట్టం సైతం ఇదే విషయాన్ని చెబుతోంది 

మల్లన్న ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలపై హైకోర్టు

 సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు సవరణ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకుంటున్న భూముల వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలకు 2013–భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్రయోజనాలను కల్పించి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని చట్టం సైతం స్పష్టంగా చెబుతోందని, ప్రభావిత కుటుంబాలకు ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేసింది. చట్టప్రకారం ప్రయోజనాలు కల్పించాక వారి భూములను తీసుకోవచ్చంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఏటిగడ్డ కిష్టాపూర్, ఇతర పొరుగు గ్రామాల్లోని భూములను తీసుకోవడం వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలకు చట్టప్రకారం పునరావాస ప్రయోజనాలు కల్పించకుండా భూములు తీసుకోరాదంటూ ఇటీవల సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది.

మిగిలిన గ్రామాలన్నింటికీ కాక ఏటిగడ్డ కిష్టాపురానికే సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను పరిమితం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్‌ కోసం తమ భూములను తీసుకుంటున్న ప్రభుత్వం, తమకు చట్టప్రకారం ప్రయోజనాలను కల్పించడం లేదంటూ ఏటిగడ్డ కిష్టాపురం గ్రామానికి చెందిన 93 మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు చట్టప్రకారం ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పిటిషనర్ల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ఏటిగడ్డ కిష్టాపురంతో పాటు పొరుగు గ్రామాల్లో కూడా భూ సేకరణ ప్రభావిత కుటుంబాలకు చట్ట ప్రయోజనాలు కల్పించాలని, అప్పటి వరకు వారి భూములను స్వాధీనం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్లు తమకు సంబంధం లేని గ్రామాల విషయంలోనూ జోక్యం చేసుకుంటూ అభ్యర్థన చేశారని, సింగిల్‌ జడ్జి కూడా అందుకు సానుకూలంగా స్పందించారని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు.. న్యాయస్థానికి వివరించారు. రిట్‌ దాఖలు చేసిన పిటిషనర్లు పొరుగు గ్రామాల తరఫున మాట్లాడటం సరికాదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించింది.

మరిన్ని వార్తలు