5జీ.. క్రేజీ..మంచితోపాటు దుష్ప్రభావాలు.

8 Aug, 2019 03:19 IST|Sakshi

భావితరాలకు వరంలా 5జీ టెక్నాలజీ

టెలికమ్యూనికేషన్‌ కొత్త పుంతలు తొక్కే అవకాశం

గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడే ఆస్కారం

అమెరికన్‌ సైబర్‌ నిపుణుడు హెరాల్డ్‌  

సాక్షి, హైదరాబాద్‌: టెలికమ్యూనికేషన్‌ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందని అమెరికన్‌ సైబర్‌ నిపుణుడు హెరాల్డ్‌ ఫర్ష్‌టాగ్‌ అన్నారు. 5జీ, సైబర్‌ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్‌ ఈ అంశాలపై పలు పుస్తకాలు రాశారు. బుధవారం బేగంపేటలోని అమెరికన్‌ కాన్సులేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోవు తరాలకు 5జీ వరంలా మారుతుందని అన్నారు. మనం గతంలో ఊహించనంత స్పీడ్, డేటా ట్రాన్స్‌ఫర్, అత్యాధునిక అప్లికేషన్లు, వైర్‌లెస్‌ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. 5జీ రాకతో వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, జంతువుల కదలికలు, పంటలకు చీడలు తదితర వివరాలను ఇప్పటికంటే వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.

మంచితోపాటు దుష్ప్రభావాలు..
5జీ రాకతో మంచితోపాటు, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని హెరాల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాల్లో గూఢచర్యానికి పాల్పడేవారు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్రోహ, ఉగ్ర చర్యలకూ ఆస్కారం ఉంటుందని అన్నారు. కమ్యూనికేషన్, రక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన వ్యవస్థలను హ్యాక్‌ చేసే ప్రమాదాలు లేకపోలేదన్నారు. గతంలో ఉక్రెయిన్‌లో పోలీసు కమ్యూనికేషన్‌ వ్యవస్థను కొందరు రష్యన్‌ హ్యాకర్లు స్తంభింపజేసారని గుర్తుచేశారు. ప్రస్తుతం చైనా 5జీ సాంకేతికత అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.

ఆదేశానికి చెందిన పలు హువాయ్, జెడ్‌టీఈ తదితర కంపెనీలు ఇప్పటికే చైనాలో 5జీ సేవలు అందించడం మొదలుపెట్టాయని తెలిపారు. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా ఆ సాంకేతికతను ఎగుమతి చేస్తోందన్నారు. అయితే, చైనాకు చెందిన కంపెనీల వల్ల భారతదేశానికి ఎలాంటి సైబర్‌ ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ఆ దేశానికి చెందిన పలు స్మార్ట్‌ఫోన్లలో భద్రతకు సంబంధించిన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని తెలిపారు. ఈ కారణంగా ఆ తరహా ఫోన్లు త్వరగా హ్యాకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో సైబర్‌ భద్రత ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌గా మారనుందని, అందుకే అనుమానాస్పద మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్ల దిగుమతిని అమెరికా 2010 నుంచే నిలిపివేసిందని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు