కలిపి కొడితే కరోనా ఫట్‌?

11 Jul, 2020 03:14 IST|Sakshi

యాంటీబాడీల మిశ్రమంతో మందు

అమెరికా ఫార్మా కంపెనీ వినూత్న ప్రయత్నం

రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసిన రిజెనెరాన్‌

మూడో దశ మానవ ప్రయోగాలకు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని మట్టుబెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయోగాలు జరుగుతుండగా అమెరికాలో కొనసాగుతున్న ఓ వినూత్న ప్రయ త్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులకు సహజ స్పందనగా శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు రెండింటినీ కలిపి అందిస్తే కోవిడ్‌–19 కారక వైరస్‌ను నివారింవచ్చని రిజెనెరాన్‌ అనే ఫార్మా కంపెనీ ఆలోచిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా  రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసుకుని తాజాగా మూడోదశ మానవ ప్రయోగా లకు సిద్ధమవడం విశేషం. ఇవి సత్ఫలితాలిస్తే ఈ ఏడాది చివరికల్లా సరికొత్త అస్త్రం అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు భాస్తున్నారు.

ప్లాస్మా థెరపీకి పరిమితుల దృష్ట్యా... 
కరోనా వైరస్‌ మనిషిలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక వ్యవస్థ వై ఆకారంలో ఉన్న కొన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాస్తా వైరస్‌కు అతుక్కుపోయి నాశనం చేయాల్సినవిగా శరీరానికి గుర్తు చేస్తుంది. లేదా ఆ వైరస్‌ మళ్లీ ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయకుండా నిరోధిస్తుంది. కోలుకున్న కోవిడ్‌ రోగుల రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి ఇతర వ్యాధిగ్రస్తులకు అందించడం ఇందుకే. అయితే ఈ ప్లాస్మా థెరపీకి కొన్ని పరిమితులున్నాయి.  ఆ ప్లాస్మాలో ఉండే వేర్వేరు రకాల యాంటీబాడీల్లో కొన్ని బాగా పనిచేస్తే మరికొన్ని అస్సలు పనిచేయవు.  కొన్ని యాంటీబాడీలు వైరస్‌ కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. వీటినే న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలని అంటారు. ఇతర యాంటీబాడీలు వైరస్‌తో కూడిన కణాలను నాశనం చేయాల్సిందిగా రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. 

యాంటీబాడీల తయారీ
ఈ థెరపీలోని ఈ పరిమితుల దృష్ట్యా ఆ సంస్థ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ఎంచుకుంది. కరోనా వైరస్‌ను లక్ష్యంగా చేసుకోగల ఈ యాంటీబాడీలను పరిశోధనశాలలో భారీ మోతాదుల్లో ఉత్పత్తి చేయగలగడం విశేషం. ఇప్పటికే రెండు రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేయడమే కాకుండా జూన్‌ 12 నుంచి తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టింది. రెండు, మూడో దశల ప్రయోగాలను సమాంతరంగా చేస్తోంది. కోవిడ్‌ ఉన్నవారిని , లేనివారిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, చిలీ ఆసుపత్రుల్లో ఉన్న 850 మంది రోగులుతోపాటు 1,050 మంది సాధారణ రోగులపై ఏకకాలంలో యాంటీబాడీల మిశ్ర మం అందించనున్నారు.

రెజెన్‌–కోవ్‌2 పేరుతో సిద్ధమైన ఈ మిశ్రమంలోని యాంటీబాడీలు రెండూ వైరస్‌లో కొమ్ముకు అతుక్కొని కణంలోకి చొచ్చుకుపోతాయని, తద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తాయని రెజెనెరాన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే మన రక్తం లో ఈ యాంటీబాడీల మిశ్రమం ఉంటే.. వైరస్‌ ప్రవేశించిన వెంటనే నిర్వీర్యమైతా యి. ఒకవేళ అప్పటికే వైరస్‌ చేరి ఉన్నా వాటిని కూడా క్రమేపీ నిర్వీర్యం చేయవచ్చు. అంటే ఈ మిశ్రమం అటు వ్యాధి నివారణకు, ఇటు చికిత్సకూ ఉపయోగ పడుతుందన్నమాట. మూడో దశ ప్ర యోగాల్లో భాగంగా ఈ యాంటీబాడీల మిశ్రమాన్ని తీసుకున్న వారిని నెలపాటు పరిశీలిస్తారు. వారిలో ఎవ రైనా కోవిడ్‌ బారిన పడ్డారా అని విశ్లేషిం చడం ద్వారా ఈ మందు పనిచేస్తుందా? లేదా? అన్నది తేలుతుంది.

>
మరిన్ని వార్తలు